భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోరైలు పరిధిని 200 కిలోమీటర్ల మేర విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం నాడు ఆయన మెట్రోరైలు అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్తో మెట్రో రైలును అనుసంధానం చేయాలని, ప్రస్తుత నిర్మాణాలకు ఆటంకాలు ఉన్నచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించైనా పనులు వేగవంతం చేయాలని మెట్రో అధికారులకు తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయి తరహాలో పూర్తిచేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వపరంగా పూర్తి సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, మెట్రో నిర్మాణంలో సమస్యలు ఎదురైతే పరిష్కరించాల్సిందిగా జంట నగరాలకు చెందిన మంత్రులకు సీఎం సూచించారని ఆయన చెప్పారు. అంతకుముందు గోల్కొండలో స్వాతంత్ర్య దిన వేడుకలు, ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేపై కేసీఆర్ చర్చలు జరిపారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, జంట నగరాల పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.