Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Interesting Details About Google CEO Sundar Pichai Wife Anjali Pichai1
ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?

ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో 'సుందర్ పిచాయ్' ఒకరు. ఈయన నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఒక సలహా అని, ఆ సలహా ఇచ్చిన వ్యక్తి తన భార్య 'అంజలి పిచాయ్' అని బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో అంజలి పిచాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.రాజస్థాన్‌లో జన్మించిన అంజలి, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెమికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ సమయంలో సుందర్ పిచాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది.ఆ తరువాత సుందర్ పిచాయ్, అంజలి పెళ్లి చేసుకున్నారు. మొదట అంజలి తన కెరీర్‌ను యాక్సెంచర్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా ప్రారంభించింది. ఈ ఉద్యోగంలో మూడేళ్లు ఉన్న తరువాత.. ప్రముఖ ఆర్థిక సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇంట్యూట్‌కు మారింది, ప్రస్తుతం ఆమె అక్కడ కీలక నిర్వహణ పాత్రను పోషిస్తోంది. అంజలి పిచాయ్.. ఇంట్యూట్‌లో కెమికల్ ఇంజనీర్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నారు. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా మంచి జాబ్ ఆఫర్ ఇచ్చింది.మైక్రోసాఫ్ట్, ట్విటర్ కంపెనీలలో జాబ్ ఆఫర్ రావడంతో.. సుందర్ పిచాయ్ గూగుల్ జాబ్ వదిలేయాలకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య అంజలికి చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు.సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరిగా ఎదగడానికి అంజలి మద్దతుగా నిలిచారు. సుందర్ తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు చాలా కాలం విడిపోయిన తర్వాత కూడా.. అంజలికి అతనిపై ఉన్న దృఢమైన నమ్మకం అతని విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: రతన్ టాటా వీలునామా.. ఎవరికి ఎంత కేటాయించారంటే?సుందర్ పిచాయ్, అంజలి.. ఇప్పుడు కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ హిల్స్‌లో వారి ఇద్దరు పిల్లలు కావ్య, కిరణ్‌లతో నివసిస్తున్నారు. 2023లో ఆమె వృత్తిపరమైన విజయాలు.. సహకారాలకు గాను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆమెను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం అంజలి మొత్తం సంపద రూ.830 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

No Varma Nagababu Now Officially Became Pithapuram Zamindar2
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!

పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్‌ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

All Out for 120 What Can I say Public Paid To: Sehwag Slams SRH Batting3
అప్పట్లో పంజాబ్‌.. ఇప్పుడు సన్‌రైజర్స్‌: సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) బ్యాటింగ్‌ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు. పేరుకే జట్టులో ‘విధ్వంసకర బ్యాటర్లు’ ఉన్నారని.. కానీ వారి వల్ల ప్రేక్షకులకు ఎలాంటి వినోదం లభించడం లేదని పేర్కొన్నాడు. బౌలర్లకు అంతగా సహకరించని ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై కూడా పరుగులు చేయలేక.. చేతులెత్తేయడం వారి పేలవ ప్రదర్శనకు నిదర్శనమని పేర్కొన్నాడు.ఐపీఎల్‌-2024లో అద్భుత బ్యాటింగ్‌తో ఫైనల్‌ వరకు చేరుకున్న సన్‌రైజర్స్‌.. టైటిల్‌ పోరులో మాత్రం 113 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బౌలింగ్‌లోనూ విఫలమై.. తద్వారా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఐపీఎల్‌-2025 (IPL 2025)ని ఘనంగా ఆరంభించినప్పటికీ హ్యాట్రిక్‌ పరాజయాలతో చతికిల పడింది.ఒక్కరూ నిలబడలేదుతాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో ఫోర్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) మరుసటి బంతికే అవుట్‌ కాగా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 2, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరారు.ఆ తర్వాత నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. భాగస్వామ్యం నెలకొల్పుతారనుకున్న కమిందు మెండిస్‌ (27), హెన్రిచ్‌ క్లాసెన్‌ (33) కూడా నిరాశపరిచారు. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడనుకున్న అనికేత్‌ వర్మ (6) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫలితంగా 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే సన్‌రైజర్స్‌ ఆలౌట్‌ అయింది.80 పరుగుల తేడాతో ఓటమిఅంతకు ముందు ఇదే పిచ్‌పై చక్కటి షాట్లు ఆడుతూ కేకేఆర్‌ బ్యాటర్లు 200 పరుగులు స్కోరు చేశారు. అయితే, ఈ టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ సులువుగానే ఛేజ్‌ చేస్తుందనుకుంటే.. 120 పరుగులకే కుప్పకూలి.. 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రైజర్స్‌ బ్యాటర్లలో మెజారిటీ మంది సులువైన క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్‌ చేరడం గమనార్హం.ఈ నేపథ్యంలో కేకేఆర్‌- సన్‌రైజర్స్‌ ఫలితంపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్‌ హైదరాబాద్‌ జట్టు తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘ఒకప్పుడు పంజాబ్‌ జట్టుకు ఇలాంటి పేరుండేది. ముందు నుంచి రాణించడం ఆఖర్లో చేతులెత్తేయడం.. ఇప్పుడు సన్‌రైజర్స్‌ పరిస్థితి అలాగే కనిపిస్తోంది.కేకేఆర్‌ బౌలింగ్‌ అంత గొప్పగా ఏమీ లేదు.. కానీవాళ్లు 190 పరుగులు చేసి ఓడిపోయారు.. 160 రన్స్‌ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో 200 పరుగులు ఛేదించే క్రమంలో 120 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. నిజానికి కేకేఆర్‌ బౌలింగ్‌ అంత గొప్పగా ఏమీ లేదు. బంతి కూడా టర్న్‌ కావడం లేదు. ఇదే పిచ్‌పై వాళ్ల బ్యాటర్లు 200 పరుగులు సాధించారు.అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు పిచ్‌ నుంచి అంతగా సహకారం కూడా అందలేదు. వికెట్‌ కాస్త స్లోగా ఉంది. అందుకే వాళ్లు ఎక్కువగా స్లో బాల్స్‌ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్‌ క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త ఓపికగా ఎదురుచూడాలి. పరిస్థితులకు అలవాటుపడిన తర్వాత పరుగుల వేట మొదలుపెట్టాలి.కానీ ఈరోజు వాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. జట్టులో ఎంతో మంది బ్యాటర్లు ఉన్నారు. కానీ ఏం లాభం అవసరమైనపుడు ఒక్కరూ పరుగులు చేయలేకపోయారు. 120 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. జనాలు డబ్బు ఇచ్చి మరీ మీ ఆటను చూడటానికి వస్తారు.ఈసారి మ్యాచ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగినా చాలా మంది సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ చూసేందుకు వచ్చారనడం అతిశయోక్తి కాదు. కానీ మీరు వారందరినీ నిరాశకు గురిచేశారు’’ అని సెహ్వాగ్‌ విమర్శల వర్షం కురిపించాడు.ఐపీఎల్‌-2025: కేకేఆర్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌👉కేకేఆర్‌ స్కోరు: 200/6 (20)👉సన్‌రైజర్స్‌ స్కోరు: 120 (16.4)👉ఫలితం: 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌ గెలుపు.చదవండి: రూ. 20 లక్షలు.. రూ. 20 కోట్లు.. ఏదైనా ఒకటే.. ఎక్కువ డబ్బు ఇస్తే ప్రతి మ్యాచ్‌లో స్కోరు చేయాలా?

RGV Saaree Movie Review And Rating In Telugu4
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ

ఆర్జీవి డెన్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్‌ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్‌ సంభ్యాల్‌)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్‌ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్‌ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్‌ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్‌ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్‌ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్‌ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్‌ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్‌ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్‌ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు.

Annamalai Backs Out Of Tamil Nadu Party Chief Race5
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన

కోయంబత్తూర్‌: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అన్నామలై.. పార్టీకి జోష్‌ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.శుక్రవారం ఆయన కోయంబత్తూర్‌లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR— ANI (@ANI) April 4, 2025

Indian Judiciary Helpless To Prohibit Social Media Use By Children Below 13 Yrs6
మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌పై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్‌ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్‌ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్‌(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్‌ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్‌ ఫౌండేషన్‌ ఈ పిల్‌లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్‌లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్‌ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్‌ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్‌ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్‌ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్‌ నేరాలు.. మైనర్లకు సైబర్‌ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్‌ మీడియా, గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్‌ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్‌ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట.

YSRCP Leaders Comments On Naganjali Death Case Issue7
‘మిస్టర్‌ పవన్‌.. దీపక్‌ తాట ఎందుకు తీయలేదు?’

సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.విద్యార్థిని నాగాంజలి మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పందిస్తూ..‘నాగాంజలి మృతి చాలా బాధాకరం. నరరూప రాక్షసుడి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్‌లో రాసింది. దీపక్ పనిచేసే కిమ్స్‌లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదు. వైద్యం అందుతుందో కూడా ఆరా తీయలేదు.పవన్‌.. కేవలం మాటలేనా?ఆడపిల్లలకు అన్యాయం చేస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. నాగాంజలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు. నాగాంజలికి అంత అన్యాయం జరిగితే దీపక్ తాట ఎందుకు తీయలేదు పవన్?. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా పవన్. మీ మాటలు చేతలకు పనిచేయవా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. నాగాంజలి 12 రోజులుగా ఆసుపత్రిలో వైద్యం పొందుతుంటే.. వారిని కనీసం పరామర్శించారా?. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలైనా ఇచ్చారా?.ఆడబిడ్డలకు రక్షణ కరువు..ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారా?. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కామెడీ స్కిట్స్‌ చూసి ఎంజాయ్ చేసే శ్రద్ధ ఆడపిల్లల మీద లేదా?. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుకుంటున్నారు. ఆడ పిల్లలు, ప్రజల రక్షణపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు. ఆడపిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా శిక్షలు పడవనే ధైర్యంతో బరితెగించి రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఏపీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరందిశ యాప్‌ కాపీనే శక్తి..గతంలో వైఎస్‌ జగన్‌ దిశా యాప్ తెచ్చారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రంతో పొత్తులో ఉన్న మీరు దిశా చట్టాన్ని ఎందుకు ఆమోదించుకోలేక పోతున్నారు?. దిశ యాప్‌పై ఇప్పటి హోం మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తిగా పేరు మార్చారు. మీ శక్తి యాప్ ఏమైపోయిందో హోమ్ మంత్రి సమాధానం చెప్పాలి. శక్తి టీమ్‌లు ఎక్కడికి పోయాయి?. శక్తి యాప్ సరిగా పనిచేసుంటే ఆడపిల్లలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?. అనిత మాటలు చేతల్లో కనిపించవా?. నిందితులు తెలుగుదేశం వారైతే వారికి రక్షణ కల్పిస్తున్నారు. కేసుల నుంచి బయటపడేలా ప్రభుత్వం చూస్తోంది. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పటికైనా మంత్రి మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు మరలా పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.బాధితురాలికి న్యాయం జరగాలి..నాగాంజలి మృతిపై మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ స్పందిస్తూ..‘నాగాంజలి మరణం బాధాకరం. బాధితురాలు సూసైడ్ నోట్‌లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తాం. నాగాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం తమ బాధ్యతగా ఆదుకోవాలి. నిందితుడు నుంచి ఆర్థిక సహాయం బాధితురాలికి అందకుంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ఈ ఘటనపై హోం మంత్రి, డిప్యూటీ సీఎం స్పందించక పోవడం బాధాకరం.

Kancha Gachibowli Land Dispute: Bhatti Vikramarka meets with CS8
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్‌ రిపోర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్‌ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్‌ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

Husband left his wife speechless after he brought a surprise guest to their wedding9
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్‌ డే గిఫ్ట్‌ : కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్‌ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్‌ డే రోజున డైమండ్‌ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్‌. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్‌ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్‌ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్‌ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement