ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్‌లైన్‌ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్‌లైన్ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు.