
తెలంగాణకు రెండో స్థానం..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ‘డీఐపీపీ’ జాబితాలో
అగ్రస్థానంలో బీహర్
న్యూఢిల్లీ:వ్యాపార నిర్వహణ సులభతరం చేసే చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. వ్యాపార నిర్వహణ సులభతరమయ్యేలా సంస్కరణలు, చర్యలు తీసుకున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) రూపాందించింది. ఈ జాబితాలో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న బిహార్ రాష్ట్రం 8.53 శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది జాబితాలో బిహార్ 21వ స్థానంలో ఉంది.
6.46 శాతం స్కోర్‌తో తెలంగాణకు రెండో స్థానం దక్కింది. జార్ఖండ్‌కు మూడు, మధ్య ప్రదేశ్‌కు నాలుగు, కర్నాటకకు ఐదో స్థానం దక్కాయి. మొత్తం 340 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. గత ఏడాది 91 అంశాల ఆధారంగానే జాబితాను తయారు చేశారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన వ్యాపార నిర్వహణకు అనుకూలమైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. ఈ తాజా డీఐపీపీ జాబితాలో ప్రస్తుతం ఈ రాష్ట్రం ఆరో ర్యాంక్‌కు పడిపోయింది.
వ్యాపార నిర్వహణకు అనుకూలమైన చర్యలను తీసుకుంటున్న రాష్ట్రాలకు ర్యాంక్‌లు ఇవ్వడాన్ని మోదీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ప్రారంభించింది. జూన్ వరకూ పూర్తి చేసిన సంస్కరణల వివరాల ఆధారంగా ప్రపంచ బ్యాంక్ సాయంతో మదింపు చేసి ఈ జాబితాను డీఐపీపీ రూపొందించింది.