వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
♦ ఒక్కో పోస్టుకు పది మంది పోటీ
♦ 1,224 ఖాళీలకు 11,481 మంది దరఖాస్తు
♦ వారంలోగా ఎంపిక ప్రక్రియ పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు.. భారీ వేతనమూ రాదు.. కానీ పోటీ మాత్రం విపరీతంగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లా విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. సోమవారం సాయంత్రానికి దరఖాస్తు గడువు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,224 ఖాళీల భర్తీకి విద్యాశాఖ ఉపక్రమించగా.. ఏకంగా 11,481 మంది దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో విద్యా వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
రిజర్వేషన్ల పద్ధతిలోనూ..
వలంటీర్ల నియామక భర్తీని స్థానికత, రోస్టర్ పద్ధతితోపాటు ప్రభుత్వం రిజర్వేషన్లను పాటిస్తోంది. కుల రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈమేరకు దరఖాస్తులను స్వీకరించారు. అరుుతే రిజర్వేషన్ల పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించగా.. ఏకంగా ఒక్కో పోస్టుకు సగటున 10మంది దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్థానికులకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించినప్పటికీ వేలల్లో దరఖాస్తులు రావడంతో అధికారులు గందరగోళంలో పడ్డారు. రెగ్యులర్ పద్ధతిలో భర్తీచేస్తే ఈ సంఖ్య మూడింతలు కానుంది. ఉప్పల్ మండలంలో మూడు ఖాళీలకుగాను 281 దరఖాస్తులు వచ్చారుు. జిల్లాలో అత్యధికంగా బషీరాబాద్ మండలంలో 827 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా తాండూరు మండలం నుంచి 797 దరఖాస్తులు, కుల్కచర్ల మండలంలో 743 దరఖాస్తులతో వచ్చారుు. వాలంటీర్ల భర్తీ ప్రక్రియ వారంలోగా పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.