
కుదరదంటే కుదరదు.
కట్ కుదరదు.
ముడియాదంటే ముడియాదు.
కట్ ముడియాదు.
జి.ఎస్.టి. ఎలాగూ కడుతున్నాం..
సినిమా టిక్కెట్‌లక్కూడా!
వాక్ స్వాతంత్య్రానికి ఉన్న నాలుకను
కోస్తానంటారా?!
ముడియాదు.
ముడియాదంటే ముడియాదు.
టాలెంట్ ఉంది. డబ్బుల్లేవు. మెడికల్ సీటు రాలేదు. ఆ బాధ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో అర్జున్ ‘జంటిల్‌మన్’ చూస్తే తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళతాం. స్ట్రెయిట్‌గా వెళితే పని కాదు. ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు అంటాడు. కొట్టాల్సిన కాగితం కొడితే ఇంకే కాగితాలూ అక్కర్లేదు. ఇంత ఘోరమా! ఎంత ఘోరమో కమల్‌హాసన్ ‘భారతీయుడు’ చూస్తే తెలుస్తుంది. వైద్యో నారాయణ హరి. డాక్టర్ అంటే దేవుడు. కానీ, కార్పోరేట్ హాస్పిటల్‌లో వైద్యం దెయ్యం! శవాన్ని కూడా పీక్కుతింటుంది. చిరంజీవి ‘ఠాగూర్’ చూస్తే తెలుస్తుంది.
బుద్ధుడు ప్రాపంచిక జ్ఞానం కోసం బోధి వృక్షం కిందికి వెళ్లాడు. ఇప్పుడా శ్రమ అక్కర్లేదు. వెళ్లి ఏసీ థియేటర్‌లో కూర్చుంటే చాలు. వ్యవస్థలోని మ్యాన్‌హోల్స్, లూప్‌హోల్స్ మొత్తం రెండున్న గంటల్లో తెలిసిపోతాయి. శంకర్ అవినీతిని చూపిస్తాడు. వర్మ అండర్‌వరల్డ్‌ను చూపిస్తాడు. మణీసార్ తీవ్రవాదాన్ని చూపిస్తాడు. భన్సాలీ చరిత్రను చూపిస్తాడు. సుకుమార్ లవ్వుని, పూరీజగన్నాథ్ కొవ్వునీ చూపిస్తారు. ఇవన్నీ సినిమాల్లోనే కాదు, సోషల్ స్టడీస్‌లోనూ ఉంటాయి. కానీ అవి చదివినా అర్థం కానివి, ఇవి చూస్తే అర్థమైపోతాయి. అదీ సినిమా పవర్. జి.ఎస్.టి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని మాత్రమే మోదీ చెబుతాడు. జి.ఎస్.టి. అంటే అసలర్థం మన శ్రమలోంచి మరికొంత దోచుకోవడం అని తమిళ్ హీరో విజయ్ చెబుతాడు. అందుకే సినిమాలంటే గవర్నమెంట్‌లకు భయం.లేటెస్టుగా ఇప్పుడు తమిళ చిత్రం ‘మెర్సల్’ సెంట్రల్ గవర్నమెంట్‌ని ఠారెత్తిస్తోంది. అందులో జి.ఎస్.టి.కి యాంటీగా ఉన్న డైలాగ్స్‌ని కట్ చేయకపోతే సినిమాను ఆడనిచ్చేది లేదని బీజేపీ.. థియేటర్‌ల ముందు కాపుగాసింది. ఢిల్లీ నుంచి ఒక్క ఆజ్ఞ జారీ అయితే చాలు. మెర్సల్ బంద్ అయిపోతుంది. నిన్న తెలుగులో రిలీజ్ కాబోయి కూడా ‘అదిరింది’ (మెర్సల్) ఆగిపోయింది.
‘మెర్సల్’లో ఏముంది?
అసలా టైటిల్‌లోనే ఉంది. మెర్సల్ అంటే విరుచుకుపడ్డం. చావుదెబ్బ కొట్టడం. కలెక్షన్‌లలో కూడా మెర్సల్ బాక్సు బద్దలు కొట్టింది. మొదటి మూడు రోజుల్లోనే మోర్ దేన్ హండ్రెడ్ క్రోర్స్! పిక్చర్ రిలీజ్ అయి, ఒక షో నడవగానే కాంట్రావర్సీలు రిలీజ్ అయ్యాయి. మోదీని తిట్టారని, హిందువుల్ని హర్ట్ చేశారని! ‘ఎవర్రాశార్రా ఆ డైలాగులు!’ ఇదే ఇప్పుడు తమిళనాడులో సూపర్ హిట్ డైలాగ్. కోర్టులో కేసులు వేశారు. విజయ్ ఇంటి మీదకు రాళ్లు విసిరారు. బీజేపీ లీడర్ హెచ్ రాజా.. ‘నీ అబ్బ రేయ్.. నీ సంగతి మాకు తెలీదా’ అనే మాటనే కాస్త సాఫ్ట్‌గా విజయ్ ఓటర్ ఐడీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ‘ట్రూత్ ఈజ్ బిట్టర్’ అనే కామెంట్ పెట్టాడు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ అని బయట పెట్టడం అతడి వ్యూహం.
కమల్, రజనీ కలిశారు!
‘మెర్సల్ ’ రాజకీయంగా, మతపరంగా ఇప్పుడొక వేడివేడి పెసరట్టు. ఈ అట్టు వేసిన డైరెక్టర్ అట్లీ 31 ఏళ్ల వాడు. ఈ అట్టుకు తగినంత వేడి, నూనె, అల్లం జీలకర్ర, పచ్చిమిరప, ఉల్లిపాయ ముక్కలు జోడించిన విజయేంద్ర ప్రసాద్ 75 ఏళ్ల వాడు. ఆవేశం, అనుభవం కలిశాయి. ఇక సెంటర్‌కి సెగ తగలకుండా ఉంటుందా? జి.ఎస్.టి మీద, డిజిటల్ పేమెంట్‌ల మీద, దేవాలయాల మీద, డాక్టర్ల మీద సినిమాలో ఉన్న విసుర్లను తీసేయకపోతే సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుందని తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందర్రాజన్.. పైకి లెటర్ పెట్టాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైలెంటుగా ‘మెర్సల్’ ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ని తొలగించింది. కలెక్షన్‌లను తగ్గించి, సినిమాను చంపేయడానికి పైరేటెడ్ సైట్‌లలో సినిమాను ముక్కలు ముక్కలుగా లింక్ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్, బీజేపీ లీడర్ జి.వి.ఎల్. నరసింహారావు మాటామాటా అనుకున్నారు. ‘వెరీ లో ఐక్యూ, వెరీ లో జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ సినిమా తీశారు’ అని నరసింహారావు టీవీ ఇంటర్వ్యూలో అంటే, అది చూసి ‘హౌ డేర్ యు!’ అని అఖ్తర్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కూడా సీన్‌లోకి వచ్చారు. ‘మిస్టర్ మోడీ.. తమిళ్ సంస్కృతిని, స్వాభిమానాన్ని డీమోనిటైజ్ చెయ్యడానికి ట్రై చెయ్యకండి’ అని ట్వీట్ చేశారు. రజనీ, కమల్ కూడా నోరు తెరిచారు. సినిమా సూపర్ అన్నారు. పెద్ద హీరోలు ఆ మాత్రం అన్నా చాలు. పెద్ద సపోర్ట్.
ఇప్పుడేం జరుగుతుంది?
‘మెర్సల్’ డైలాగ్స్‌ని కట్ చేస్తారా? కట్ చేస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌నే కట్ చేసినట్లు! అయితే కొన్నిసార్లు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని కూడా కట్ చేయవలసి వస్తుంది. తప్పదు.
రాజమౌళి ‘బాహుబలి 2’ తమిళ్ వెర్షన్‌లో ‘పగడాయ్’ అనే పదం ఆ రాష్ట్రంలోని ఒక సామాజిక వర్గాన్ని నొప్పించింది. పగడాయ్ అనేది దళితులలోని ‘సఖిలియార్’ అనే ఒక సబ్ కాస్ట్‌కు వాడుక మాట. అది అబ్యూజివ్‌గా ఉందని ఆ వర్గం మేధావులు అభ్యంతరం చెప్పారు. నిరసనకారులు మధురైలోని బాహుబలి 2 ఆడుతున్న ఒక థియేటర్‌పై పెట్రోల్ బాంబు వేశారు! డైలాగ్ రైటర్ కుర్రాడు. అతడు అపాలజీ చెప్పి, ఆ వర్డ్‌ను తొలిగించాక మాత్రమే సఖిలియార్‌లు శాంతించారు.
గుండె ఆగి.. కొట్టుకుంది!
‘విశ్వరూపం’ రిలీజ్ ఆగిపోయినప్పుడు కమల్ హాసన్ కన్నీళ్లు పెట్టుకోవడం టీవీల్లో మీరు చూసే ఉంటారు. ప్రాణం పెట్టి తీశాడు మరి! అప్పులు తెచ్చాడు. ఇల్లు అమ్ముకున్నాడు. సొమ్మంతా కుమ్మరించాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిత్రం రిలీజ్ అయితేనే బతుకు. విదేశాల్లో విడుదలైనా విశ్వరూపానికి తమిళనాడులో విముక్తి లభించలేదు. ఇక్కడ రిలీజ్ అయితేనే కమల్‌కి ఊపిరి. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని మత సంస్థలు అడ్డు చెప్తే రిలీజ్ ఆగిపోయింది. నయం కమల్ గుండె ఆగిపోలేదు. రెండు వారాలు ఆలస్యంగా ఒళ్లంతా‘కట్’లతో బతికి బట్టకట్టాడు. తమిళనాడులో ఫీలింగ్స్ అంత గట్టిగా ఉంటాయి. గవర్నమెంట్ వెంటనే దిగొస్తుంది. ‘జల్లికట్టు’ నిషేధానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడిన ప్రజలు వాళ్లు. అంత గట్టిగా మనమూ పోరాడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని అప్పట్లో మన సినిమా యాక్టర్లు స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చారు.
చూపుడు వేలుపై సెన్సార్!
రజనీ ‘బాబా’ విడుదలకు ముందు ఓ పాటలో ‘పెరియార్’ పేరు వినిపించింది.
పెరియార్ (పెరియార్ ఇ.వి.రామస్వామి) తమిళుల పందొమ్మిదో శతాబ్దపు తిరుగుబాటు నాయకుడు. వాళ్ల సెల్ఫ్‌రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది ఆయనే. ‘బాబా’ చిత్రంలోని పాటలో ఆయన గౌరవం తగ్గేలా రాశారని ‘ద్రవిడ కళగం’ (ద్రవిడుల తొలి రాజకీయ పార్టీ) నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి సినిమా రీలీజ్‌కు ముందే పెరియార్ పేరును తీయించింది!
ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు పాటైనా, సీన్ అయినా.. డైలాగ్ ఫ్లోని బ్రేక్ చేసుకోవడం మంచిదే. కానీ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే వేలును కూడా కట్ చేసుకోమంటే ఎలా? ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని ప్రభుత్వం తీసేసుకున్నట్లే కదా. అంటే ప్రభుత్వమే పౌర హక్కుల్ని హరించినట్లు!
తెలుగులోనూ డైలాగ్ అబార్షన్స్
మన దగ్గర పాటల్లో ఎక్కువ కట్స్ పడ్డాయి. ఆ మధ్య ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని ‘గుడిలో, బడిలో, మదిలో, ఒడిలో’ సాంగ్‌లోని నమకం, చమకం శివస్తోత్ర పదాలపై ‘అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య’ అభ్యంతరం చెప్పడంతో ఆఖరి నిముషంలో వాటిని తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’ చిత్రంలోని ‘చారీ’ పాటలో పంచెకట్టు, పిలకజుట్టు అనే పదాలు సినిమా రిలీజ్‌కు ముందే కట్ అయ్యాయి. ‘దేనికైనా రెడీ’ లో కూడా ఇదే ఇష్యూ. బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న సీన్స్‌ని, డైలాగ్స్‌నీ కట్ చేశారు. ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ చిత్రంలో సెటైర్‌లకు ఆగ్రహించిన రాజకీయ పార్టీల కార్యకర్తలు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటిని ధ్వసం చేశారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో కర్నాటక బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డిని గుర్తుకు తెచ్చే సన్నివేశాలు ఉండడంతో ఆయన నాయకులు థియేటర్‌ల అద్దాలు పగలగొట్టారు. ఇక గౌతమ బుద్ధుడి ఎదురుగా రొమాంటిక్ సాంగ్‌ని తీసినందుకు ‘రచ్చ’పై పెద్ద చర్చే జరిగింది.
ప్రభుత్వంతోనే ప్రాబ్లమ్!
సినిమాల్లో ప్రైవేటు వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే కొంచెం రగడ అవుతుంది. తర్వాత చల్లారుతుంది. ప్రభుత్వంతో పెట్టుకుంటే మాత్రం పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. అందుకే చూడండి.. ఇండియాలో గవర్నమెంట్‌లపై సెటైర్లు వేసే సినీ దర్శకులు, నిర్మాతలు తక్కువ.భారత ప్రభుత్వం సాధారణంగా సినిమాలను బ్యాన్ చెయ్యదు. కట్‌లు సూచిస్తుంది. లౌకిక రాజ్యం కాబట్టి. కానీ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందను కున్నప్పుడు, దేశ పాలనా వ్యవస్థమీద ప్రభావం చూపిస్తుందనుకున్నప్పుడు మాత్రమే సినిమాను బ్యాన్ చేస్తుంది. అలాంటివి బ్యాన్‌లు మన దగ్గర బాగా తక్కువ. కాంట్రావర్సీ మూవీలు మాత్రం ఎక్కువ. మంచి సినిమాలు ఆలోచన రేపుతాయి. ఆ ఆలోచనలను ప్రజల్లో రేపినంత కాలం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలగదు. ప్రభుత్వంలో ఆలోచనలు రేగితేనే సినిమాలకు కట్‌ల గాట్లు పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment