కాపీ ‘కత్తి’ హీరో పైనే మా పోరాటం! | kathi Film controversy on hero vijay | Sakshi
Sakshi News home page

కాపీ ‘కత్తి’ హీరో పైనే మా పోరాటం!

Published Tue, Feb 2 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

'కత్తి'కి మూలమైన తన స్ర్కిప్ట్ చూపిస్తూ నరసింహారావు

'కత్తి'కి మూలమైన తన స్ర్కిప్ట్ చూపిస్తూ నరసింహారావు

‘‘దాదాపు 16 నెలల క్రితం నుంచే ‘కత్తి’ సినిమా వివాదం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య నడుస్తోంది. మా పోరాటం తమిళ చిత్ర నిర్మాత ఆర్.బి.చౌదరి మీదో, లేకపోతే ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ మీదో కాదు! కేవలం ఆ చిత్ర హీరో విజయ్ మీదే’’ అని ప్రముఖ రచయిత, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తమిళ చిత్రం ‘కత్తి’ కథ తనదేననీ, ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్నందున ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలనీ దర్శక, రచయిత నరసింహారావు పేర్కొన్న సంగతి తెలిసిందే. నరసింహరావుకు న్యాయం జరిగేంత వరకూ తెలుగు రీమేక్ నిర్మాణం నిలిపివేయాలంటూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘంతో పాటు  తెలుగు ఫిలిమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య) ఇప్పటికే సహాయ నిరాకరణ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం చైర్మన్ - ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి 150వ చిత్రానికి అడ్డంకులు కల్పిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంత మంది హీరో రామ్‌చరణ్ అభిమానులమంటూ ‘దాసరి నారాయణరావుకు అశ్రునివాళి’ అంటూ పోస్ట్‌లు పెట్టడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. వీటన్నిటిపై వివరణనివ్వడానికి తె లుగు చలన చిత్ర దర్శకుల సంఘం, తెలుగు ఫిలిమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయల సమావేశం ఏర్పాటు చేశాయి.
 
ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ-‘‘చాలాకాలం క్రితమే దర్శక-రచయిత  నరసింహారావు ‘కత్తి’ కథ చాలా మందికి చెప్పాడు. కానీ ఫైనల్‌గా తమిళ నటుడు విజయ్ హీరోగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్, స్టోరీ సిట్టింగ్స్ జరిగాయి. కొంత కాలం పాటు ఈ కథతో ట్రావెల్ చేసిన హీరో విజయ్ సడన్‌గా ఈ కథకు ఓ అనుభవమున్న దర్శకుడైతే బాగుంటుందని తనకు ఇచ్చేయమన్నారు. కానీ నరసింహారావు దానికి అంగీకరించలేదు. ఇది జరిగిన ఏడాదికి అదే కథతో ‘కత్తి’ అనే సినిమాను స్వల్ప మార్పులతో దర్శకుడు మురుగుదాస్ తెరకెక్కించారు.

ఇదీ జరిగింది. ఒకవేళ  ఇది మురుగుదాస్ సొంత కథే అనుకుంటే, మురుగుదాస్ ఈ కథ చెప్పినప్పుడు గతంలో ‘ఇలాంటి కథ నేను విన్నానే’ అని మురుగుదాస్ దగ్గర చెప్పాల్సిన బాధ్యత విజయ్‌ది కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు. అసలు కథా రచయిత అయిన నరసింహారావుకు న్యాయం చేయడం కోసమే రచయితల సంఘం సహా అన్ని సంఘాల ప్రయత్నమని పేర్కొన్నారు.

తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ -‘‘ఈ వివాదం చిరంజీవి గారు రీమేక్ చేద్దామని ప్రకటించాక మొదలుకాలేదు. చాలా నెలల నుంచి మేము పోరాటం చే స్తున్నాం. అయినా దీన్ని చిరంజీవి, దాసరి నారాయణరావుల మధ్య వివాదంగా మార్చడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ‘దాసరి నారాయణరావుకు అశ్రునివాళి’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని చెప్పారు.
 
కాగా, కథాహక్కుల సంఘం వైస్-చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘ఈ వివాదం గురించి చిరంజీవి గారిని అడిగాను. వివాదాలన్నిటినీ పరిష్కరించుకున్నాకే రీమేక్ హక్కులను అమ్మాలని తమిళ నిర్మాతలతో రామ్‌చరణ్ ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. మా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే చిరంజీవి గారు ‘కత్తి’ రీమేక్ చేద్దామనుకొన్న తర్వాత ఏమీ ఈ కథపై వివాదం రేగలేదు. అంతకన్నా ముందే చాలా నెలలుగా ఈ కథాచౌర్యం సమస్య నలుగుతూ ఉంది. సామరస్యంగా పరిష్కరించాలన్నదే మా ప్రయత్నం’’ అన్నారు. దర్శకుడు త్రిపురనేని చిట్టి, నటుడు కాదంబరి కిరణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement