
బాహుబలి కంటే గొప్పగా గ్రాఫిక్స్
బాహుబలి చిత్రం కంటే గొప్పగా పులి చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆ చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పులి చిత్రం పైనే ఇండస్ట్రీ దృష్టి అంతా. ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం పులి. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ విలన్‌గా నటించిన పులి చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. పీటీ.సెల్వకుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది.ఇది సోషియో ఫాంటసీ కథా చిత్రం. కాగా ఇందులో గ్రాఫిక్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయట.
ఇటీవల తెరపైకి వచ్చిన సంచలన చిత్రం బాహుబలి చిత్రం గ్రాఫిక్స్‌కు చిరునామాగా పేరు తెచ్చుకుంది. అయితే దాన్ని మించిన గ్రాఫిక్స్ పులి చిత్రంలో చోటు చేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. అంతకు ముందు వచ్చిన నాన్‌ఈ చిత్రంలో 1200 గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండగా బాహుబలిలో 1400 గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పులి చిత్రంలో 2400 గ్రాఫిక్స్ సన్నివేశాలు విస్మయపరచనున్నాయని అంటున్నారు. ఈ గ్రాఫిక్ సన్నివేశాలను ప్రపంచంలోని తొమ్మిది దేశాల్లో రూపొందించారట. వీటికి 1500 మంది సాంకేతిక నిపుణులు పని చేశారట. చైనాలో కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు విజయ్‌కు సంతృప్తి కలిగించకపోవడంతో మళ్లీ తిరిగి పంపించేయించామని అంటున్నారు చిత్ర వర్గాలు. అలాంటి పులి ఏపాటి గాండ్రిస్తుందో తెలియాలంటే మరొక్కరోజే ఆగాల్సిందే. అక్టోబర్ 1న పులి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.