
కీపర్‌గా సాహాకే మా ఓటు!
చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టీకరణ
ముంబై: టెస్టు జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్‌గా తమ తొలి ప్రాధాన్యత వృద్ధిమాన్ సాహాకే అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ఇరానీ కప్‌లో అద్భుత ప్రదర్శనతో అతను తన ఫిట్‌నెస్ కూడా నిరూపించుకున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. సాహా గాయం కారణంగానే జట్టుకు దూరమయ్యాడనే విషయాన్ని ప్రసాద్ గుర్తు చేశారు. ‘కోల్‌కతా టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన సాహా అంతకుముందు వెస్టిండీస్‌లోనూ సెంచరీ సాధించాడు. అతను ఫామ్ కోల్పోయి కాకుండా గాయం వల్లే జట్టుకు దూరమయ్యాడు. టెస్టుల్లో కీపింగ్ బాగా చేసే ఆటగాడికే మా ప్రాధాన్యత.
పార్థివ్ వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగైనా, ఇప్పటికీ సాహానే మా అత్యుత్తమ వికెట్ కీపర్’ అని తమ నిర్ణయాన్ని ప్రసాద్ పరోక్షంగా వెల్లడించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో బాగా ఆడినా 2019 ప్రపంచకప్‌లో ధోని, యువరాజ్ ఆడటం గురించి ఇప్పుడే ఆలోచించడం చాలా తొందరపాటు అవుతుందని ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.