ఆదుకున్న చిరాగ్ గాంధీ
► గుజరాత్ తొలి ఇన్నింగ్స్ 300/8
► రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్
ముంబై: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో చిరాగ్ గాంధీ (159 బంతుల్లో 136 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో గుజరాత్ జట్టును ఆదుకున్నాడు. వరుస వికెట్ల పతనాన్ని తన అద్భుత బ్యాటింగ్‌తో అడ్డుకున్న తన ఆటతీరుతో రంజీ చాంపియన్ గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. దీంతో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 300 పరుగులు చేసింది. గాంధీకి జతగా ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పటేల్ (9 బ్యాటింగ్) ఉన్నాడు.
మన్ ప్రీత్ జునేజా (90 బంతుల్లో 47; 7 ఫోర్లు), ధృవ్ రావల్ (94 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను రెస్టాఫ్ ఇండియా బౌలర్లు వణికించారు. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ గోహెల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పేసర్లు సిద్ధార్థ్ కౌల్ (4/73), పంకజ్ సింగ్ (3/77) ధాటికి 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టు ఇబ్బందుల్లో పడింది. ఫామ్‌లో ఉన్న ప్రియాంక్ (61 బంతుల్లో 30; 6 ఫోర్లు), కెప్టెన్ పార్థివ్ (11) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో జట్టు ఇన్నింగ్‌్సను నిర్మించే బాధ్యతను 26 ఏళ్ల గాంధీ తీసుకున్నాడు. జునేజాతో కలిసి రెస్టాఫ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరు దాదాపు రెండో సెషన్ అంతా ఆధిపత్యం ప్రదర్శించి ఐదో వికెట్‌కు 110 పరుగులు జత చేశారు.