బహ్రేన్‌ టు హైదరాబాద్‌ వయా బెంగళూరు! | - | Sakshi
Sakshi News home page

బహ్రేన్‌ టు హైదరాబాద్‌ వయా బెంగళూరు!

Oct 4 2025 6:20 AM | Updated on Oct 4 2025 6:20 AM

బహ్రేన్‌ టు హైదరాబాద్‌ వయా బెంగళూరు!

బహ్రేన్‌ టు హైదరాబాద్‌ వయా బెంగళూరు!

వ్యవస్థీకృతంగా సాగుతున్న మాదకద్రవ్యం దందా

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఉన్న డ్రగ్‌ పెడ్లర్‌ బహ్రేన్‌లో ఉన్న సప్లయర్‌కు ఆర్డర్‌ ఇస్తాడు. ఇతగాడు విదేశీయుల ద్వారా డెడ్‌డ్రాప్‌ విధానంలో బెంగళూరుకు సరుకు చేరుస్తాడు. అక్కడ ఉన్న ట్రాన్స్‌పోర్టర్‌ దాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చి డెలివరీ చేస్తాడు. ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సాగుతున్న ఎండీఎంఏ డ్రగ్‌ దందాను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) ఛేదించింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర శుక్రవారం ప్రకటించారు.

ఇన్‌స్ట్రాగాం ద్వారా ఆ నెట్‌వర్క్‌లోకి...

బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ పదో తరగతి వరకు చదివాడు. ఆపై స్థానికంగా ఉన్న ఓ బేబీ స్టోర్‌లో ఉద్యోగిగా మారాడు. యజమానికి తీవ్ర నష్టాలు రావడంతో 2024లో షాపు మూతపడి తన ఉద్యోగం కోల్పోయాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించిన ఉస్మాన్‌కు ఇన్‌స్ట్రాగాం యాప్‌ ద్వారా అశ్విన్‌ దాస్‌ రమావత్‌తో పరిచయమైంది. కేరళకు చెందిన ఇతగాడు బెంగళూరులో బీసీఏ చదివాడు. ఆపై అక్కడే కొన్ని ఉద్యోగాలు చేసినా ఈ ఏడాది ఫిబ్రవరిలో బహ్రేన్‌ ఉద్యోగం కావడంతో అక్కడకు వెళ్లాడు. ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైన విదేశీయులతో కలిసి డ్రగ్‌ నెట్‌వర్క్‌ నడుపుతున్నాడు. వాట్సాప్‌ ద్వారా అశ్విన్‌ను సంప్రదించే ఉస్మాన్‌ తనకు అవసరమైన డ్రగ్‌ ఆర్డర్‌ పెట్టి, అందుకు అవసమైన మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తాడు.

డెడ్‌డ్రాప్‌ విధానంలో డెలివరీ...

అశ్విన్‌ బెంగళూరులో చదువుతున్న రోజుల్లో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న రాహుల్‌ కుమార్‌తో పరిచయమైంది. ఇద్దరూ మలయాళీలే కావడంతో వీరి మధ్య స్నేహం బలపడింది. 2024 జులైలో చదువు పూర్తయిన తర్వాత రాహుల్‌ అక్కడే ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగిగా చేరాడు. పని ఒత్తిడి కారణంగా కొన్నాళ్లకే మానేశాడు. అశ్విన్‌ ఆదేశాల మేరకు అతడి నెట్‌వర్క్‌లో ట్రాన్స్‌పోర్టర్‌గా మారాడు. ఉస్మాన్‌ ఇచ్చిన ఆర్డర్‌ను బట్టి అశ్విన్‌ కొందరు విదేశీయుల ద్వారా ఆ డ్రగ్‌ను బెంగళూరు చేరుస్తాడు. వీళ్లు నేరుగా రాహుల్‌ను కలవకుండా ఓ నిర్మానుష్య ప్రాంతంలో డ్రగ్‌ ప్యాకెట్‌ ఉంచుతారు. ఆ ఫొటో, లోకేషన్‌ను అశ్విన్‌కు వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేస్తారు. ఈ వివరాలను రాహుల్‌కు పంపే అశ్విన్‌ ఆ డ్రగ్‌ ప్యాకెట్‌ తీసుకోమని చెప్తాడు. ఆపై ఉస్మాన్‌ సహా వివిధ పెడ్లర్స్‌కు సరఫరా చేయిస్తాడు.

ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు, డెడ్‌డ్రాప్‌తో డెలివరీ

ఇరువురు నిందితుల్ని అరెస్టు చేసిన హెచ్‌–న్యూ టీమ్‌

50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం

రూ.2 వేలకు కొని రూ.10 వేలకు విక్రయం

ఈ డ్రగ్‌ను గ్రాము రూ.2 వేలకు ఖరీదు చేస్తున్న అశ్విన్‌ దాన్ని ఉస్మాన్‌కు రూ.8 వేలకు సరఫరా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి ట్రాన్స్‌పోర్టర్‌ రాహుల్‌ను కమీషన్‌ ఇస్తున్నాడు. ఉస్మాన్‌ కస్టమర్లకు గ్రాము రూ.10 వేలకు విక్రయిస్తున్నాడు. ఈ నెట్‌వర్క్‌పై హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్‌ జీఎస్‌ డానియేల్‌కు సమాచారం అందింది. ఆయన నేతృత్వలో ఎస్సై సి.అనంతరాములు నేతృత్వంలోని బృందం నిఘా ఉంచింది. 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ డెలివరీ చేయడానికి వచ్చిన రాహుల్‌, తీసుకునే ప్రయత్నం చేసిన ఉస్మాన్‌లను చాదర్‌ఘాట్‌ వద్ద పట్టుకుంది. ఆ ఆపరేషన్‌లో చాదర్‌ఘాట్‌ పోలీసులతో కలిసి చేశాయని పేర్కొన్న డీసీపీ సుధీంద్ర కేసును తదుపరి చర్యల నిమిత్తం ఆ ఠాణాకే అప్పగించామని తెలిపారు. డ్రగ్స్‌ దందాపై వివరాలు తెలిసిన వాళ్లు 8712661601 నెంబర్‌కు కాల్‌ చేసి తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement