ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యపై కేసు నమోదు

Published Sun, May 19 2024 6:35 AM

-

తెలకపల్లి: మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌ నారమళ్ల వెంకటయ్య ఆత్మహత్య ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. ఓ వృద్ధురాలి బంగారు నాను ఆటోలో పోయిందన్న అనుమానంతో నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు స్టేషన్‌కు పిలిపించి మందలించారని పేర్కొన్నారు. అయితే తన భర్త వెంకటయ్యను పోలీసులు అన్యాయంగా ఈనెల 15వ తేదీన స్టేషన్‌కు తరలించి చితకబాదారని.. మళ్లీ 16న స్టేషన్‌కు రావాలని చెప్పడంతో భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి భార్య అలివేల ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తన భర్తను అకారణంగా కొట్టిన పోలీసులపై చర్య తీసుకొని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా, ఆటో డ్రైవర్‌ వెంకటయ్యను పోలీసులు మందిలించారే తప్ప, కొట్టలేదని ఎస్‌ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎస్పీకి ఫిర్యాదు

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌కు తెలకపల్లికి చెందిన అలివేలు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. తెలకపల్లికి చెందిన అలివేల తన భర్త వెంకటయ్య దొంగతనం చేశాడని నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అకారణంగా పోలీసులు కొట్టడంతో దెబ్బలకు తాళలేక శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. తన భర్తను అకారణంగా కొట్టిన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement