రైతులను ముంచిన వాన | Sakshi
Sakshi News home page

రైతులను ముంచిన వాన

Published Sat, May 18 2024 7:20 AM

రైతుల

సాక్షి నెట్‌వర్క్‌ : అన్నదాతను అకాల వర్షాలు వీడడం లేదు. వారం, పది రోజులుగా కురుస్తున్న వానలతో తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసి ముద్దవుతోంది. గురువారం రాత్రి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్య రాశులు, కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసిపోయాయి. అక్కడక్కడ మామిడి కాయలు నేలరాలాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

● గుండాల మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలోని రైతులు బండపై ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. అలాగే కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మాసాన్‌పల్లి సెంటర్‌లో కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసిముద్దయ్యయి. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. సకాలంలో ధాన్యాన్ని ఎగుమతి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు.

● ఆలేరు మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి చాలా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసాయి. పలు చోట్ల వాన నీటిలో వడ్లు కొట్టుకుపోగా ఎత్తడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా శారాజీపేటలో నష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రానికి రెండు వారాల క్రితం 170 బస్తాల ధాన్యం తీసుకువచ్చానని, ఇప్పటి వరకు కాంటా వేయలేదని రైతు శేఖర్‌ తెలిపాడు. అలాగే బత్తుల కొండల్‌రెడ్డి అనే రైతు ధాన్యాన్ని తేమ సాకుతో 20 రోజులుగా తూకం వేస్తలేరని తెలిపారు. వర్షాలకు వడ్లు తడుస్తున్నాయని, కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

● ఆత్మకూర్‌ (ఎం) మండలంలో గంట సేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి మండల కేంద్రం, రహీంఖాన్‌పేటలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసాయి. ఈదురు గాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగాయి. పోసానికుంటలో మామిడి కాయలు నేలరాలాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

● చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కుప్పల మధ్య వాన నీరు చేరింది. నీటిని తొలగించేందుకు రైతులు శ్రమించాల్సి వచ్చింది. అలాగే పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిశాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు.

● రాజాపేట మండలంలోని రేణికుంట, రాజాపేట, నెమిల, బేగంపేట, నర్సాపురం గ్రామాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి.

● యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే మబ్బులు కమ్ముకోవడంతో రైతులు అప్రమత్తం అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడకుండా టార్పాలిన్లు కప్పి జాగ్రతలు తీసుకున్నారు. అదే విధంగా యాదాద్రి కొండపైన భక్తులు టెంటు, మండపాల కిందికి చేరారు.

గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం

కొనుగోలు కేంద్రాల్లో

తడిసి ముద్దయిన ధాన్యం

కాపాడుకోవడానికి రైతుల తంటాలు

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే

కొనుగోలు చేయాలని రైతులు, రాజకీయ పార్టీల ఆందోళన

రైతులను ముంచిన వాన
1/2

రైతులను ముంచిన వాన

రైతులను ముంచిన వాన
2/2

రైతులను ముంచిన వాన

Advertisement
 
Advertisement
 
Advertisement