
గుంటూరు రూరల్: తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తెలుసనీ, ఏడాది కాలంగా ఎన్నోసార్లు చెప్పినా ఆపలేక పోయారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తెచ్చినా అడ్డుకోలేదని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి రూ.100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని ప్రకటించారు.
గుంటూరు రూరల్ మండలం పొత్తూరు శివారు ఓబులునాయుడుపాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్వారీలను ఎమ్మెల్యే రావెల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న రెండు ప్రొక్లెయిన్లు, రెండు లారీలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రావెల మీడియాతో మాట్లాడుతూ ఓబులునాయుడుపాలెం, పొత్తూరు, నాయుడుపేట, పేరేచర్ల, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో నారాయణస్వామి, అశోక్ అనే వ్యక్తులు అజయ్ అనే వ్యక్తి ద్వారా ప్రభుత్వ, అటవీ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.