ఉద్దానంపై సర్కార్‌ నిర్లక్ష్యం | State Govt has neglected and failed to solve the titli cyclone victims | Sakshi

ఉద్దానంపై సర్కార్‌ నిర్లక్ష్యం

Published Tue, Oct 16 2018 7:38 AM | Last Updated on Sat, Apr 6 2019 8:55 PM

State Govt has neglected and failed to solve the titli cyclone victims  - Sakshi

కవిటి/సోంపేట: తిత్లీ తుపానుతో కకావికలమైన ఉద్దానం ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీకర తుపానుకు సర్వస్వం కోల్పోయిన కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు,  పలువురు పార్టీ నేతలు  కవిటి, సోంపేట మండలాల్లో సోమవారం పర్యటించారు. కవిటిలో ఉమారెడ్డి, ధర్మాన మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీరు కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో, కరెంటు అందించలేని దుస్థితిలో పాలన దిగజారిందన్నారు.

 తుపాను బాధితులను ఆదుకోవడంలో సర్కార్‌ తీరుకు నిరసనగా స్థానికంగా ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం విషయంలో ఏ ఒక్క రైతు కూడా సంతృప్తిగా లేరన్నారు. కొబ్బరి చెట్టుకు 1200 రూపాయల పరిహారం ప్రకటన కంటితుడుపు చర్యగా ఉందని ఉమ్మారెడ్డి విమర్శించా రు. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఎటువంటి ఫలసాయం దక్కని రైతుకు ఇంత టి ఘోరమైన పరిహార ప్రకటన ముఖ్య మంత్రి చేయడం దురదృష్టకరమన్నారు. కనీసం చెట్టుకు రూ.5000 అందించాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో సంభవించిన తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.

 సీఎం చంద్రబాబు నుంచి పలువురు మంత్రులు వచ్చినా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటిని అందించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని.. అందుకే ప్రజలు  ఆగ్రహావేశాలతో భగ్గుమంటున్నారన్నారు. నష్టపరిహారాల ప్రకటనలో కూడా కొబ్బరిరైతు పట్ల ప్రభుత్వ వివక్షత వ్యక్తమైందనిన్నారు. ఈ   పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు  ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్, రాష్ట్రకార్యదర్శి నర్తు రామారావు, మామిడి శ్రీకాంత్, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, కంచిలి జెడ్పీటీసీ సభ్యుడు జామి జయ,ఇచ్ఛాపురం మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి , సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ దాస్, మంగి గణపతి, పిఎం తిలక్, హనుమంతు కిరణ్‌కుమార్‌ తదితర నేతలు పాల్గొన్నారు.  

ఆ సాయం సరిపోదు
వైఎస్సార్‌ సీపీ నేతల ఎదుట 
వాపోయిన సోంపేట, కంచిలి రైతులు


సోంపేట/కంచిలి: తుపాను దెబ్బకు పూర్తిగా నష్ట పోయామని, ప్రభుత్వం అందజేస్తామన్న సహాయం ఎటూ సరిపోదని  కంచిలి మండలం కుత్తుమ, సోంపేట మండలం రుషికుడ్డ, కొర్లాం గ్రామం రైతులు వైఎస్సార్‌ సీపీ నేతల ఎదుట వాపోయారు.   సోంపేట, కంచిలి మండలాల్లో ధర్మాన ప్రసాదరావు,   ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం జిల్లా పార్ల మెంటరీ నియోజకవర్గ సమన్వయక్తర దువ్వాడ శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగాగా రైతులతో ఉమ్మారెడ్డి, ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తామన్న నష్ట పరిహారం సరిపోతుందా అని ఆరా తీశారు.

దీనికి వారు స్పందిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎటూ సరిపోదన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వం తరం కాదని వాపోయారు. కుత్తుమ గ్రామానికి చెందిన రైతులు మన్మథరావు, జి.వైకుంఠరావు, రవి, బొన్నయ్య తదితరులు మాట్లాడుతూ తుపానుతో తీవ్రంగా నష్టపోయామన్నారు. ఎకరానికి సుమారు 50 కొబ్బరి చెట్లు వరకు నేలకొరిగా యని, ఉన్న చెట్లు కూడా పూర్తిగా పాడైపోయావన్నారు. పది సంవత్సరాల వరకు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండదని ఆవేదన చెప్పారు.

 రైతులను ఆదుకోవాలంటే రైతు కమిటీలతో సమావేశం నిర్వహించి.. ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొబ్బరి చెట్టుకు రూ. 1200 రూపాయలు ప్రకటించడం దారుణమన్నారు.  తుపాను వచ్చి నాలుగు రోజులు కావస్తున్నా  ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటసీ మాజీ సభ్యుడు  డాక్టర్‌ ఎన్‌.దాసు, ఇచ్ఛాపురం మున్సిపల్‌ చైర్మన్‌ పిలక రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ మంగి గణపతి, మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, ఉలాల శేషుయాదవ్, పూడి నేతాజి, రజనికుమార్‌ దొలాయి, మడ్డు రాజారావు, మార్పు సూర్యం, త్రినాథ, రవి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement