
న్యూఢిల్లీ: దరఖాస్తుదారుల ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను అమలు చేసేందుకు మరింత సమయం కావాలని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ (యూఐడీఏఐ)ని మొబైల్ ఆపరేటర్లు కోరారు. ఇందుకు అవసరమైన బయోమెట్రిక్ డివైజ్‌లు తయారు చేసే సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేకపోవడం దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫేస్ ఆథెంటికేషన్ అమలుకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 15తో ముగిసిపోనున్న నేపథ్యంలో యూఐడీఏఐకి ఆపరేటర్ల ఫోరం (యాక్ట్) ఒక లేఖ రాసింది.
దీన్ని అమలు చేయాలంటే డివైజ్ వ్యవస్థ అంతా సిద్ధమయ్యాక కనీసం రెండు నెలల వ్యవధి అయినా ఉండాలని, అప్పటిదాకా పెనాల్టీలు విధించరాదని కోరింది. ఈకేవైసీ ఆథెంటికేషన్ పూర్తయ్యాక.. దరఖాస్తుదారు ఫోటో తీసుకోవడం, యూఐడీఏఐ డేటాబేస్‌లో వారి ఫోటోతో సరిపోల్చి చూసుకోవడం వంటి నిబంధనలు .. ఎలాంటి అదనపు ప్రయోజనం లేకుండా ఒకే పనిని పది సార్లు చేసినట్లవుతుందని పేర్కొంది.