
సాక్షి, మహబూబాబాద్: డబ్బులు పోయాయని.. తీసుకున్నవారు ఇచ్చేయాలని.. అడగటంతో అవమానభారానికి గురైన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని పత్తిపాక కాలనీకి చెందిన కాగితపు శ్రీను, రాధికల పెద్ద కూతురు స్రవంతి(13) గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
కాగా, పార్ట్‌టైమ్ పీఈటీ సంధ్యారాణికి చెందిన రూ.350 చోరీకి గురయ్యాయి. దీంతో సోమవారం రాత్రి ఆమె విద్యార్థినులందరినీ పిలిచి డబ్బులు తీసిన వారు తెల్లవారే సరికి అక్కడే పెట్టాలని.. లేదంటే బాగుండదని హెచ్చరించింది. మంగళవారం ఉదయం స్రవంతి వాంతులు చేసుకొని పడిపోయింది. వెంటనే జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కొద్దిసేపటికే స్రవంతి మృతిచెందింది. కాగా, ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.