ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో గజ్వేల్ నియోజకవర్గంలో భారీ సభల నిర్వహణకు టీఆర్‌ఎస్, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి.
గజ్వేల్/వర్గల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో గజ్వేల్ నియోజకవర్గంలో భారీ సభల నిర్వహణకు టీఆర్‌ఎస్, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి. వర్గల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నిర్వహించే సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం మూడు గంటలకు కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా వర్గల్ చేరుకుంటారు. వర్గల్ సభ ఖరారు కావడంతో శనివారం రాత్రే పార్టీ కార్యకర్తలు, నేతలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
ఈ మేరకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రాములు నాయక్, రాష్ట్ర నేత కమలాకర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి రాజయ్య యాదవ్ తదితరులు ఆదివారం ఉదయం వర్గల్ సందర్శించారు. స్థానిక విశ్వతేజ స్కూల్ సమీపంలోని మైదానాన్ని వారు ఎంపిక చేశారు. ఈ మేరకు అక్కడి మైదానాన్ని చదును చేయించి, హెలిప్యాడ్ నిర్మాణ పనులను ముమ్మరం చేయించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వర్గల్ సభకు నియోజకవర్గంలోని తెలంగాణ అభిమానులు, ప్రజలు, భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
గజ్వేల్‌లో చంద్రబాబు సభ
గజ్వేల్ సంగాపూర్ రోడ్డు వైపున గల ప్రసన్నాన్నాంజనేయ ఆలయం పక్కనగల మైదానంలో సోమవారం ఉదయం 9.30గంటలకు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినీనటుడు పవన్‌కల్యాణ్, టీడీపీ నేత ఆర్. క్రిష్ణయ్య, మహాజన సోషలిస్టు పార్టీ అధినేత మంద కృష్ణ తదితరులు హాజరవుతున్నట్లు ఆ పార్టీ టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి తెలిపారు.