
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నిస్సందేహంగా గౌరవనీయ వ్యక్తి అని నాకు తెలుసు. తన గురించి తెలిసిన వారు ఆయన కష్టపడి పనిచేసే రాజకీయ నేత అని అదనంగా చెబుతారనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. కానీ నా ఆందోళన కాస్త భిన్నమైనది. తాను చేస్తున్న ప్రకటనల పట్ల గానీ లేక తన అభిప్రాయం, ఆమోదనీయత కలిగిస్తున్న ప్రభావం పట్ల గానీ శివరాజ్ చౌహాన్ జాగ్రత్త వహిస్తున్నారా? రాజకీయనేతకు ఇవి తరచుగా మరింత సంక్లిష్ట వ్యవహారాలుగా ఉంటాయి.
గత నెల వాషింగ్టన్‌లో జరిగిన అమెరికా–భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక సమావేశంలో శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ, భోపాల్‌లోని రహదారులు అమెరికా రాజధానిలో ఉన్న రోడ్లకంటే మెరుగ్గా ఉంటాయని ప్రకటించారు. ‘‘నేను వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగి రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, అమెరికా రహదారుల కంటే మధ్యప్రదేశ్ రహదారులే ఉత్తమంగా ఉన్నాయని పించింది’’ అని ఆయన చెప్పారు. ‘కేవలం మాట కోసం తాను ఇలా అనడం లేద’ని చేర్చడం ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని మరింతగా నొక్కి చెప్పారు.
శివరాజ్ చౌహాన్ ఇంతటి విపరీత ప్రకటనను ఎందుకు చేశారన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడింది. తన ప్రకటన నిజంగా వాస్తవమేనని ఆయన నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారే అనుకుందాం.. తన రాష్ట్రం గురించి ప్రశంసించడానికి వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ శ్రోతలు సరైన వ్యక్తులేనా? చివరగా, ఒక ప్రముఖ భారత రాజకీయనేత తన విదేశీ అతిథేయులను ఆకట్టుకునే విధానం ఇదేనా?
ఏదేమైనప్పటికీ, చౌహాన్ గుర్తించదగిన స్థాయిలో నిలకడతనం కలిగిన వ్యక్తి అనే చెప్పాలి. ఆయన తన శ్రోతలను బట్టి తన వాణిని మార్చుకునే రకం కాదు. అందుకే స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా భోపాల్ ప్రజల ముందు మాట్లాడుతూ మరింతగా గొప్పలు చెప్పుకున్నారు. తన రాష్ట్రానికి, అమెరికాకు మధ్య పోలి కల గురించి కాస్త మోతాదుకు మించే మాట్లాడారు. కానైతే ఈసారి ఒక విమానాశ్రయ రహదారికి లేక రాష్ట్రంలోని మొత్తం ప్రధాన రహదారుల వ్యవస్థకూ పరిమితం కాలేదు. కాకపోగా, అభివృద్ధి చెందిన ప్రపంచంలో చాలా దేశాల కంటే మధ్యప్రదేశ్ ఉత్తమమైనదని నొక్కిచెప్పారు.
‘‘మన మధ్యప్రదేశ్.. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల కంటే ఎంతో ఉత్తమమైనది. దీన్ని చూడాలంటే ముఖ్యంగా సానుకూల దృష్టి ఉండాలి... కేవలం బానిస మనస్తత్వం ఉన్న వ్యక్తులే తమ కంటే ఇతర దేశాలు ఉత్తమమైనవని నమ్ముతారు.’’
ఇప్పుడు, ఇంత విస్తృతస్థాయి పోలిక దిగ్భ్రాంతి కలిగించడమే కాదు, దానికింద ఉన్న కళాత్మక తర్కం నిరోధించడానికి వీలులేనిదని కూడా కనిపిస్తోంది. సీఎం ప్రకటనను బట్టి మొదటిగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం కేవలం ఉత్తమమైనదే కాదు. అమెరికా, ఇంగ్లండ్ కంటే ‘‘ఎంతో ఉత్తమమైనది.’’ మరో మాటలో చెప్పాలంటే ఇకపై రెండో అభిప్రాయమే లేదు. తర్వాత ఈ వాస్తవాన్ని గ్రహించాలంటే, ఆమోదించాలంటే నీకు సానుకూల ఆలోచన ఉండాలి. ఇది లేని వారు బూజుపట్టినవారు, తిరోగమన దృక్పథం కలవారు. చివరగా చౌహాన్ చావుదెబ్బ తీశారు. ఇది ప్రతిపక్షాలను, నేతలను మొత్తంగా మూగబోయేలా చేసింది. ఇతర దేశాలే మెరుగన్న అభిప్రాయం నేటికీ కలిగివున్నవారు ‘బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు.’ స్వతంత్ర ఆలోచన కలిగిన వ్యక్తులు ‘సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా’ అన్న భావానికే అంటిపెట్టుకుని ఉండాలన్నమాట. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, మన మంచి ముఖ్యమంత్రి చెప్పిన వాస్తవాన్ని మొదటగా ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవస్థాపకులలో ఒకరిగా నేడు పరిగణిస్తున్న వ్యక్తి పేర్కొన్నారన్నదే.
ఒక ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా అర్థరహితంగా మాట్లాడుతున్నపుడు, తాను అలా ఎందుకు చేస్తున్నారని మీరు ప్రశ్నిం చాల్సి ఉంది. అలా మాట్లాడటానికి రెండు కారణాలు ఉండి ఉంటాయి. బహుశా జోక్ కోసం అలా చెప్పి ఉంటారు లేక బుకాయిస్తూండవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ చెప్పిన విషయం నిర్దిష్టంగా చెప్పాలంటే చమత్కారం కోసం కాదు. అందుకే అది నవ్వుతాలుగా చెప్పిందంటే నాకు సందేహమే. అంటే మంచిమనిషి చౌహాన్ తన శ్రోతలను మోసగించి ఉంటారు.
నిజంగానే ఇది రాజకీయ నేతలందరి నిజస్వభావాన్ని మనముందుకు సన్నిహితంగా తీసుకువస్తుంది. మనల్ని అన్ని వేళల్లో మూర్ఖులను చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తుంటారు. చౌహాన్ ఈ అంశంలో సరిగ్గా వ్యవహరించలేదు. అందుకే తాను మొరటు వ్యాఖ్య చేశారు. కానీ ఇతరుల మాటలను వినేముందు మీరు మీ మనసులో చౌహాన్‌ను ఉంచుకోండి. అదే మనందరికీ తాను తెలి యకుండానే ఇచ్చిన బహుమతి.
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net