
నేడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శతజయంతి. ఆమె మరణించిన 30 ఏళ్ల తర్వాత కూడా మన రాజకీయ దిఙ్మండలంలో ఒక మహామూర్తిలాగా నిలిచి ఉంటున్నారు. ఇందిర ఒక రాజకీయవేత్త అనే అంశంతో మొదలుపెడదాం. ఆమెను మనం నేటికీ అత్యంత గౌరవభావంతో చూస్తున్నట్లుగా ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి. కానీ ఆమె గొప్ప ప్రధానమంత్రా లేక దీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్న వ్యక్తా?
ఇందిర ప్రధానమంత్రిత్వానికి సంబంధించినంతవరకు 1970–71 నాటి బంగ్లాదేశ్ సంక్షోభం, తూర్పుపాకిస్తాన్ లొంగుబాటు అత్యంత కీలకమైనవని చాలామంది అంగీకరిస్తున్నారు. భారత సైన్యాన్ని సన్నద్ధపరిచేందుకు అవసరమైన సమయాన్ని ఫీల్డ్ మార్షల్ మానెక్‌షాకు ఇచ్చే విజ్ఞత ఆమెకుండింది. భారత వైఖరికి మద్దతును కూడగట్టడంలో అలుపెరుగని అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించే నైపుణ్యం కూడా ఆమెకుండేది.
ఇందిర విజయాలపై భిన్నాభిప్రాయాలూ తలెత్తుతున్నాయి. మొదటిది, తూర్పు పాకిస్తాన్ పతనం తర్వాత యుద్ధాన్ని నిలిపివేయడంలో ఆమె తప్పుగా వ్యవహరించారా? పశ్చిమరంగంలో పాకిస్తాన్‌తో పోరాడటానికి, కశ్మీర్ వ్యవహారాన్ని తేల్చివేయగలిగిన ఒక అవకాశాన్ని ఆమె చేజార్చుకున్నారా? లేదా అలా చేసి ఉంటే భారత్ తట్టుకోలేని అంతర్జాతీయ ఉత్పతనాలను ఎదుర్కొనేదా? సిమ్లా సదస్సులో నాటి ప్రధాని జుల్ఫికర్ భుట్టో కశ్మీర్‌పై ఆడినమాటను విశ్వసించడంలో ఇందిరది తప్పు అంచనాయేనా? లేక ఆమెముందు అప్పుడు మరో ప్రత్యామ్నాయం లేదా?
బంగ్లాదేశ్ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత 1975లో విధిం చిన అత్యవసర పరిస్థితి ఆమె అధోగతికి చిహ్నం. ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ నిస్సందేహంగా ఇందిర బలహీనతే. కానీ అతడు తలపెట్టిన సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, మురికివా డల నిర్మూలన కార్యక్రమాల గురించి ఆమెకు నిజంగానే తెలీదా?
అయితే 1977లో ఓటమి తప్పదని తెలిసి కూడా సార్వత్రిక ఎన్నికలకు ఆమె పూనుకున్నారా? మరోమాటలో చెప్పాలంటే అది ఆమె పశ్చాత్తాపం ప్రకటించే ప్రయత్నమా? లేదా నిఘా వ్యవస్థలు ఆమెను తప్పుదోవ పట్టించాయా? ప్రధానిగా రెండో దఫా పదవీ కాలంలో సిక్కుల్లో అశాంతితో ఆమె వ్యవహరించిన తీరు ఆపరేషన్ బ్లూ స్టార్‌గా పరిణమించింది. అయితే అది ఆమెముందున్న ఏకైక అవకాశమేనా లేక స్వర్ణదేవాలయానికి విద్యుత్తు, నీరు, ఆహా రాన్ని అందకుండా చేయడం ద్వారా మిలిటెంట్లను బయటకు నెట్టేలా ఆమె ఒత్తిడి చేసి ఉంటే బాగుండేదా?
నిజమే.. అకాలీలను అణిచివేయడానికి, తర్వాత అతడిని ఒక క్రూర రాక్షసుడిగా మార్చడానికి బింద్రన్‌వాలేను కాంగ్రెస్ పార్టీనే పెంచిపోషించి ఉండవచ్చు. స్వర్ణదేవాలయ పరిస్థితితో తప్పుగా వ్యవహరించినందుకు పలువురు జీవిత చరిత్రకారులు ఇందిరాగాంధీని నిందిస్తున్నారు కానీ ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత కూడా సిక్కు గార్డులను తన అంగరక్షకులుగా కొనసాగించిన ఘనతకు ఆమె ప్రశంసార్హురాలు కాదా? ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఆ గార్డుల్లో ఇద్దరు ఆమెను చంపడానికి వీలుకల్పించిందా?
ప్రధానమంత్రికి రాజకీయాలు విలక్షణ అంశం కావచ్చు కానీ ఆర్థిక వ్యవస్థతో ఆమె వ్యవహరించిన తీరు సందేహాస్పదమైంది. ఒకవైపు ఆమె హరిత విప్లవానికి నేతృత్వం వహించారు, మరోవైపున లైసెన్స్ రాజ్‌ను సృష్టించారు. రాజకీయ కారణాలతోటే ఆమె బ్యాంకుల జాతీయీకరణను దుస్సాహసికంగా అమలు చేశారు. 1970లు, 80లలో భారత్ పేలవమైన ఆర్థిక పనితీరుకు ఆమెనే తప్పుబట్టాల్సి ఉందా? కాంగ్రెస్ పార్టీపై ఆమె ప్రభావాన్ని మీరు తోసిపుచ్చలేరు. నెహ్రూ కంటే ఎక్కువగా వంశపాలనా సంప్రదాయాన్ని ఇందిరే ప్రారంభించారు. పార్టీపై ఆమె నియంత్రణ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, భారత్‌లో అతి పురాతన పార్టీని గాంధీ కుటుంబ ఉపాంగంగా కుదించి వేసిందా?
ఇందిరాగాంధీ కెరీర్ పూర్తిగా నాటకీయ ఉత్తానపతనాలతో కూడి ఉంది. 1966 నాటి ఒక మూగబొమ్మ (గూంగీ గుడియా) 1971 నాటికి భారత మహారాణిగా పరివర్తన చెందింది. 1977లో అధికారాన్ని కోల్పోయినా మళ్లీ 1980లో గోడకుకొట్టిన బంతిలా అధికారానికి చేరువయ్యారు. 1984లో హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించడంలో ఆమె నైపుణ్యాన్ని అతికొద్దిమంది మాత్రమే సందేహిస్తారు.
ఇందిరను ఒక శక్తివంతమైన మగధీరుడిలాగా మనం భావిం చవచ్చు, నిజానికి మనోజ్ఞమైన హాస్య చతురత, సాటిలేని అభిరుచి, శైలికి ఆమె మారుపేరు. కొన్ని సమయాల్లో ఆమెది తొందరపాటు మూర్తిమత్వం కూడా. అయితే విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె ధైర్యసాహసాలతో వ్యవహరించేది.
అంతిమంగా, అలాంటి మహిళ అస్వస్థతతోనో, వృద్ధాప్యం తోనో చనిపోవాలనుకున్నారా? పదవీ విరమణ కాలానికి ఆమె హత్యనే ఎంచుకుని ఉండవచ్చని లేక ఓటమిలో భ్రష్టత్వాన్ని ఎంచుకుని ఉండవచ్చని సూచించడం కాల్పనికతే అవుతుందా?
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net