వడదెబ్బతో రాష్ట్రంలో ఇప్పటివరకు 66 మంది మృత్యువాత పడ్డారు.
ఇప్పటివరకు 66 మంది మృత్యువాత
అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 28 మంది
మెదక్‌లో 11, నిజామాబాద్‌లో ఏడుగురు..
అమలుకు నోచుకోని కార్యాచరణ ప్రణాళిక
మండుటెండల్లోనూ నడుస్తున్న స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బతో రాష్ట్రంలో ఇప్పటివరకు 66 మంది మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 28 మంది చనిపోయారు. మెదక్ జిల్లాలో 11, నిజామాబాద్ జిల్లాలో ఏడుగురు, కరీంనగర్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో నలుగురు చొప్పున, నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. విపత్తు నిర్వహణ శాఖ బుధవారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు చేరడంతో వడదెబ్బ మరణాల సంఖ్య భారీగా పెరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 50 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో జనం ఆందోళన చెందుతున్నారు.
కానరాని కార్యాచరణ
వడ గాడ్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు విపత్తు నిర్వహణ శాఖ కార్యాచరణ ప్రణాళికను అన్ని జిల్లాలు, వివిధ శాఖాధిపతులకు పంపించింది. అయితే ఆ ప్రణాళిక సక్రమంగా అమలవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే అనేకచోట్ల సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ మృతిచెందిన వారంతా కూలీలే. పరిస్థితి తీవ్రతకు తగ్గట్లుగా అధికారుల స్పందన లేదు.
తీవ్ర ఎండల్లో నడుస్తున్న స్కూళ్లు..
వాస్తవానికి ఎండలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి. కానీ అనేకచోట్ల మిట్టమధ్యాహ్నం వరకు స్కూళ్లు నడుస్తూనే ఉన్నాయి. పాఠశాలలు వదులుతున్న సమయాల్లో ఎండ, రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సందర్భాల్లో ఉదయం 11 గంటలలోపే స్కూళ్లు ముగించేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బస్సులను కూడా నడపొద్దని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇది కూడా ఎక్కడా అమలు కావడంలేదు. బస్టాండ్‌లు, ఆరుబయట పని చేసేవారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. కానీ మచ్చుకు కూడా కనిపించడం లేదు. కనీసం మంచినీటి వసతి కూడా లేని దుస్థితి. అలాగే ఐవీ ప్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్ కొరతతో అనేక ప్రభుత్వాసుపత్రులు అల్లాడుతున్నాయి.
ఒక్కరోజే 11 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: వడదెబ్బతో వివిధ జిల్లాల్లో బుధవారం ఒక్కరోజే 11 మంది మృతి చెందారు. వీరిలో వరంగల్ జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.