
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయంపై సీపీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వయనాడు నుంచి రాహుల్ పోటీ చేయడం.. ‘పప్పు స్ట్రైక్’గా అభివర్ణిస్తూ.. సీపీఎం అధికార పత్రిక ‘దేశాభిమాని’ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే కేరళ మినహా దేశమంతటా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సీపీఎం ఎన్నికలకు వెళుతోంది. యూపీలోని అమేథితోపాటు దక్షిణాదిలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై సీపీఎం గుర్రుగా ఉంది. రాహుల్ గాంధీ బీజేపీ బలంగా ఉన్న చోట పోటీచేయాలని కానీ, మిత్రపక్షంపై పోటీకి దిగడమేమిటని కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్ విమర్శించారు. వయనాడ్‌లో రాహుల్ పోటీ చేస్తున్నందున.. వామపక్షాలు పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేయగా.. వయనాడ్‌లో రాహుల్‌ను ఓడించి తీరుతామని, ఇందుకోసం వామపక్షాలు శాయశక్తులా కృషి చేస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు.