
సాక్షి, విజయవాడ: గత కొద్ది రోజులుగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారన్న ఊహగానాలకు తెరపడింది. టీడీపీ, బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ లక్ష్మీనారాయణ ఆదివారం అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మీనారాయతో పాటు మాజీ వైస్ ఛాన్స్‌లర్ రాజగోపాల్ రెడ్డిలను పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావం నుంచే లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయాలని భావించినా కుదరలేదని.. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయబోతుండటం ఆనందంగా ఉందన్నారు.
ఎక్కడినుంచైనా సిద్దమే
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం తాను ఎక్కడ నుంచి పోటీ చేసే విషయాన్ని పవన్ ప్రకటిస్తారన్నారు. తాను ఎక్కడినుంచైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు.