
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న తైనాల, విజయనిర్మల తదితరలు
తగరపువలస: రాజకీయపార్టీలకు బూత్‌కమిటీలే పునాదిరాళ్లని.. ఇవి ప్రజల్లో వేళ్లూనుకుని పోతే వారిమాటలే ప్రజలకు వేదవాక్కుగా, పార్టీలకు శ్రీరామరక్షగా పనిచేస్తాయని వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. మంగళవారం సంగివలస ఫారచ్యన్ ఫంక్షన్ హాలులో జీవీఎంసీ భీమిలి జోన్ వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బూత్‌కమిటీలే వైఎస్సార్‌సీపీని విజయపథాన నిలబెడతాయన్నారు.
గనన్న వెనుక పెద్ద సైన్యం ఉందని అది కార్యకర్తలు, బూత్‌కమిటీలకు అండగా నిలబడుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగనన్న కూడా అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని నవరత్నాలనే పథకాల ద్వారా వారికి మంచి చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఈ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను మరో పది మాసాల్లో ఎన్నికలు ఉన్నందున బిస్కట్లు మాదిరిగా విసురుతున్నారన్నారు. అన్న క్యాంటీన్ పథకం ద్వారా కూడా రూ.కోట్లు దోచుకునే మోసగాడు చంద్రబాబేనని ఎద్దేవా చేశారు.
భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకు చంద్రబాబు 600 హామీలు ఇచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ హామీలను అడిగితే గెలవలేమనే ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో బూత్‌కమిటీ సభ్యులు తనకు కేటాయించిన ఇళ్లలో రోజుకు రెండేసి వంతున చెక్ చేసుకుని వలస ఓటర్లు తొలగించేటట్టు, కొత్త వారిని చేర్చేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల బూత్‌కమిటీల ఇన్‌చార్జ్ కిషోర్ బూత్‌కమిటీల ప్రతినిధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకు ముందు హాలులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
శిక్షణ తరగతుల్లో సీనియర్ నాయకుడు కాకర్లపూడి వరహాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి శిల్లా కరుణాకరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జగుపల్లి ప్రసాద్, చిల్ల బాబయ్యరెడ్డి, నియోజకవర్గ బూత్‌కమిటీల ఇన్‌చార్జ్ చిర్రా రాజ్‌కుమార్, భీమిలి బూత్‌కమిటీల అధ్యక్షుడు ఉప్పాడ నాగేశ్వరరావు, ప్రధానకార్యదర్శులు జీరు వెంకటరెడ్డి, అల్లిపల్లి నరసింగరావు, కోండ్రు రామసూరప్పడు, వాసుపల్లి ఎల్లాజీ, యూత్ అధ్యక్షుడు బింగి హరికిరణ్‌రెడ్డి, బీసీ, ఎస్సీ, మహిళా, సేవాదళ్ అధ్యక్షులు వాసుపల్లి కొండబాబు, జీరు సుజాత, పందిరి విజయ్, మారుపల్లి రాము, ఎర్రయ్య రెడ్డి, ప్రభాకర్‌రావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

హాజరైన భీమిలి అర్బన్ బూత్ కమిటీల ప్రతినిధులు