
సాక్షి, విజయవాడ : పెన్షన్ కోసం వచ్చిన వృద్ధుడిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేయడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ బాబు అన్నారు. చింతమనేని ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లను టీడీపీ నేతలు చులకనగా చూస్తున్నారని విమర్శించారు. పెన్షన్ కోసం వస్తే ఒక ఎమ్మెల్యే దాడి చేయమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఉండాల్సిన లక్షణాలు చింతమనేనికి లేవన్నారు. టీడీపీ నేతలు ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిచారు కాబట్టే.. ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారన్నారు. (మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని.. వృద్ధుడిపై వీరంగం)
నోటిఫికేషన్ వస్తే చెక్కులు చెల్లుతాయా?
డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పలుమార్లు వైఎస్ జగన్ అసెంబ్లీలో కోరినప్పటికీ.. ఇంతవరకు ఒక్క పైసా కూడా చంద్రబాబు మాఫీ చేయలేదని సుధాకర్ బాబు విమర్శించారు. రుణమాఫి చేయకుండా ఎన్నికల వేళ రూ. 10వేలు ఇస్తామంటూ చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రూ.10వేలు పెట్టుబడి కింద ఇస్తున్నారో లేక రుణమాఫీ కింద ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ చెక్కులు చెల్లుతాయా అని ప్రశ్నించారు. పోస్ట్‌డేటెడ్ చెక్కులు ఇస్తూ మహిళలను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు.
చిత్తశుద్ధి ఉంటే దొచుకున్న ధనం ప్రజలకు ఇవ్వాలి
చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ది ఉంటే నారావారిపల్లి, సింగపూర్‌లో దాచుకున్న ధనాన్ని ప్రజలకు ఇవ్వాలని సుధాకర్ బాబు సవాల్ చేశారు. మంత్రులు దోచుకున్న వేల కోట్ల రూపాయలను ప్రజలకు పంచాలన్నారు. ఢిల్లీ నడివీధుల్లో చంద్రబాబు నిజస్వరూపాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారన్నారు. చంద్రబాబు దొంగతనం బయటపడింది కాబట్టే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.