
చండీగఢ్: టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి, క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. హరియాణా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఛాన్స్‌లర్‌గా కపిల్‌దేవ్ నియమితులయ్యారు. ఈ మేరకు హరియాణా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే హరియాణ స్పోర్ట్ యూనివర్సిటీకి అక్కడ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పిన మూడో రాష్ట్రంగా హరియాణా నిలిచింది. ఇప్పటివరకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశాయి.
కపిల్‌దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది.. అతడి మార్గదర్శకంలో ఈ విశ్వవిద్యాలయం అభివృద్ది చెందాలని తాము భావిస్తున్నట్లు మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. ఇప్పటికే యునివర్సిటీలో చేర్చాల్సిన కోర్సులు, సిలబస్, విధివిధానాలను రూపొందించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి క్రీడలను అభివృద్ది చేస్తున్నామని, ఈ యూనివర్సిటీలో అందిస్తున్న సౌకర్యాలతో హరియాణా క్రీడా రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి అనిల్ విజ్ ఆకాంక్షించారు.