
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో ఘనత ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మార్కును చేరడానికి ధోనికి ఇంకా 33 పరుగులు అవసరం. ఆస్ట్రేలియాతో రాంచీ వేదిక జరుగనున్న మూడో వన్డేలో ధోని ఈ ఫీట్‌ను చేరే అవకాశం ఉంది. ఇప‍్పటివరకూ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించిన పరుగులు 16,967. ఇక్కడ ఆసియా ఎలెవన్ మ్యాచ్‌లతో కలుపుకుని ధోని ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 528. ఇందులో 16 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీల సాయంతో ధోని ఈ పరుగులు సాధించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ధోని సగటు 45.00గా ఉంది.
తన కెరీర్‌లో 90 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ధోని 4,876 పరుగులు సాధించగా, 340 వన్డేల్లో 10, 474 పరుగులు నమోదు చేశాడు.ఇక అంతర్జాతీయ టీ20ల్లో 98 మ్యాచ్‌లు ఆడి 1,617 పరుగుల్ని ధోని సాధించాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు ఉండగా, టెస్టుల్లో 6 సెంచరీలు, 33 అర్థ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు ధోని ఖాతాలో ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్(24, 208), విరాట్ కోహ్లి(19, 453), సౌరవ్ గంగూలీ(18,575), వీరేంద్ర సెహ్వాగ్(17, 253)లు ఉన్నారు.
ఇక్కడ చదవండి: ‘మన ఇంటిలో మనం ప్రారంభోత్సవం చేయడమా’