ఎన్నికల కమిషన్ హెచ్చరించినా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వైఖరి మారలేదు.
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ హెచ్చరించినా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వైఖరి మారలేదు. దక్షిణ ఢిల్లీలోని అమర్‌కాలనీలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకుని తమ పార్టీకి ఓటు వేయాలంటూ స్థానికులకు ఉద్బోధించారు. ‘కాంగ్రెస్, బీజేపీలు మీ దగ్గరకు డబ్బుతో వస్తున్నాయా? ఒకవేళ అలా వస్తే కాదనకండి. డబ్బు తీసుకోండి. దుప్పట్లు, బియ్యపు బస్తాలను ఆ పార్టీలు పంచుతున్నాయనే విషయం నాకు తెలుసు. అయితే సారా ఇస్తే మాత్రం తీసుకోకండి. అది కుటుంబాలను నాశనం చేస్తుంది’ అని అన్నారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామన్నారు. నగరవాసులకు ఉచిత వైఫై వసతిని అందుబాటులోకి తీసుకొస్తానన్నారు.