భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 20వ తేదీన చెన్నైకి వస్తున్నారు. తొలిసారిగా ఆయన తమిళనాడుకు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 20వ తేదీన చెన్నైకి వస్తున్నారు. తొలిసారిగా ఆయన తమిళనాడుకు చేరుకుం టున్న కారణంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు మరైమలై నగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 21వ తేదీన చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించేందుకు నిర్ణరుుంచారు.కూటమిపై కసరత్తు: పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏర్పడిన బీజేపీ కూటమి ఛిన్నాభిన్నం కానున్న తరుణంలో అమిత్ షా రంగ ప్రవేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. డీఎంకే, అన్నాడీఎంకేలను మినహాయించి ఏడు ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రంలో తొలిసారిగా కూటమిని ఏర్పరచుకున్న రికార్డు బీజేపీ దక్కింది. బలమైన కూటమి ఉన్నా ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చామన్న ఆనందం మాత్రమే కూటమిలోని పార్టీలకు మిగిలింది. ఇదే ఉత్సాహంతో 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ కూటమి సాగుతుందా అనే అనుమానాలకు ఊతమిస్తూ ఎండీఎంకే వైదొలిగింది. పీఎంకే సైతం అదే బాటలో పయనిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీని బలోపేతం చేసిన చతురుడుగా అమిత్‌షాకు పేరుంది. అదే మంత్రాన్ని దక్షిణాలో సైతం ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ తమిళనాడుపై కూడా గురిపెట్టారు. కూటమి చీలికలు పేలికలు కాకుండా జాగ్రత్తపడడంతోపాటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చెన్నైకి చేరుకుంటున్నారు. 20, 21వ తేదీల్లో అమిత్ షా రూపొందించుకున్న కార్యక్రమాలు సైతం ఇదే సూచనలు ఇస్తున్నాయి.