ఓటర్ల జాబితాలో కొందరి పేర్ల గల్లంతు విషయమై ప్రతిపక్షాల తీరును ఎన్సీపీ తప్పుబట్టింది. ఏమైనా పొరపాట్లు జరిగివుంటే వాటిని పోలింగ్‌కు ముందే సరిచేసుకోవాల్సిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
ముంబై: ఓటర్ల జాబితాలో కొందరి పేర్ల గల్లంతు విషయమై ప్రతిపక్షాల తీరును ఎన్సీపీ తప్పుబట్టింది. ఏమైనా పొరపాట్లు జరిగివుంటే వాటిని పోలింగ్‌కు ముందే సరిచేసుకోవాల్సిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముంబై, పుణేలలో పెద్దసంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటూ అనేక ఫిర్యాదులొచ్చాయన్నారు. మృతులతోపాటు తొలగింపునకు గురైన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పార్టీలకు సీడీల రూపంలో అందజేసిందన్నారు. అంతేకాకుండా బూత్‌స్థాయిలో ఏజెంట్లను నియమించుకుని సవరించుకోవాలంటూ సూచిం చిందన్నారు.
అయితే ఏ పార్టీ ఆ పని చేయలేదన్నారు. తొలగింపు, సవరణల తర్వాత తాజా జాబితాలను కూడా ప్రచురించిందన్నారు. అయితే ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం వచ్చే నెల 17వ తేదీ తర్వాత తమ తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని కోరుతూ ప్రజలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురించిన తర్వాత కూడా వాటిని ఆయా పార్టీలు పట్టించుకోలేదని, సరిచూసుకోలేదని అన్నారు. ఆయా పార్టీలు తమ కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.