
నర్సంపేట (వరంగల్) : ఆయిల్ కంపెనీలు పెట్రో, డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతుండడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు తడిసి మోపెడవుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు నిత్యావసర సరకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 24 గంటలకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరిచేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన పాలకులు.. ఆ వైపు దృష్టి సారించడం లేదు. దీంతో ఎలా బతకాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
పెరుగుతున్న ధరలు ఆటోడ్రైవర్లతోపాటు ఆర్టీసీ, ఇతర ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ వాహనదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. రవాణా చార్జీలు పెంచలేక.. ఆటో, ఇతర వాహనాలు నడిపించడం మానలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రోజువారి సంపాదనపై ఆధారపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోవాలాలు లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పది ట్రిప్పులు రవాణా చేసినా.. పైసా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు తడిసిమోపడై నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సామాన్యులు ఆం దోళన చెందుతున్నారు.
రోజు రూ.60 లక్షలకుపైగా భారం
జిల్లావ్యాప్తంగా 43 పెట్రోల్ బంకులు ఉండగా.. పెరుగుతున్న ధరలతో జిల్లావాసులపై రోజుకు రూ.60 లక్షలకుపైగానే అదనపు భారం పడుతోంది. సెప్టెంబర్ ఆరంభంలోనే పెట్రోల్ లీటర్‌కు 50 పైసలు పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. 2018 ఫిబ్రవరి నుం చి ఇప్పటి వరకు లీటరు డీజిల్‌పై రూ.9.87, పెట్రోల్‌పై రూ.8.19 పైసలు పెరిగింది. ఏడు నెలల కాలంలోనే లీటర్ ధర రూ.10 వరకు పెరుగుతూ సామాన్యులను కంగారు పెట్టిస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడడమేగాక పెట్రోల్ బంకు యజమానులు సైతం అవస్థలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడం ఖాయంగా కనిపిస్తోంది.
ధరల పెంపు మోయలేని భారం
సామాన్య ప్రజలు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిన తరుణంలో పెట్రోలు ధరలు మోయలేని భారంగా మారాయి. సామాన్యుల అవసరాలను గుర్తెరిగి వీలైనంత వరకు ధరలను తగ్గించి ఆదుకోవాలి. శ్రీలత, ఉపాధ్యాయురాలు
ఆదాయం సగం పడిపోయింది..
మేము గతంలో రోజంతా ఆటో నడిపితే రూ.600 లాభం ఉండేది. ఈ మధ్య పెరుగుతూ వస్తున్న డీజిల్ ధరలతో ఆదాయం 300కు పడిపోయింది. మళ్లీ డీజీల్ ధరలు పెరుగుతాయని తెలుస్తాంది. ఇట్లయితే వచ్చే రోజుల్లో ఆటో నడుపుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది. –కారోజు నగేష్, ఆటో డ్రైవర్