
పిల్లలమర్రికి సెలైన్ ఎక్కిస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద మర్రి చెట్టు ‘పిల్లలమర్రి’కి సెలైన్స్ ఎక్కిస్తున్నారు. చెట్లను తొలిచే పురుగుబారిన పడిన పిల్లలమర్రి భారీ కొమ్మలను కోల్పోయింది. దీంతో గతేడాది డిసెంబర్ నుంచి పిల్లలమర్రి సందర్శనను నిలిపివేశారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పిల్లల మర్రిలోని ఒక భాగం పురుగు బారిన పడి కిందకు పడిపోయింది కూడా. ప్రమాదకరంగా పరిణమిస్తున్న పురుగును అంతం చేసేందుకు చెట్టు మొదలుకు ఎక్కించిన రసాయనం ప్రభావం చూపలేదు.
దీంతో ప్రత్యామ్నాయంగా పిల్లలమర్రికి సైలైన్ల ద్వారా కీటక సంహార మందును ఎక్కిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో గల పిల్లలమర్రి వయసు దాదాపు 700 ఏళ్లు. మర్రిచెట్టు ప్రతి రెండు మీటర్లకు ఒక సెలైన్‌ను అధికారులు ఎక్కిస్తున్నారు. దీంతో వందల కొద్దీ సెలైన్ బాటిళ్లు చెట్టుకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. కాగా, సైలెన్ల ద్వారా ఇస్తున్న చికిత్స ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు.