
జడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇంటిని కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో.. ఓ కొడుకు తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో బంధువులు.. మృతుని చిన్నకుమా ర్తెతో కర్మకాండ జరిపించారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా రిటైరయ్యాక.. మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించారు.
భార్య గతంలోనే మరణించడంతో.. సొంత ఊరిలోని 15 ఎకరాల వ్యవసాయ పొలం, రూ.60 లక్షలు.. కొడుకు గిరీష్‌కు ఇచ్చి.. మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలోని ఇంటిని.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి చనిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న గిరీష్‌కు సోదరీమణులు సమాచారం అందించారు. ఇంటిని తనకు ఇవ్వని తండ్రి అంత్యక్రియలకు రానని గిరీష్ వారికి తెగేసి చెప్పాడు. దీంతో చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టింది.