జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల కార్ల ధరలనూ పెంచనుంది. మినీ మోడల్‌తో సహా అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 5 శాతం వరకూ పెంచనున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం తెలిపింది.
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల కార్ల ధరలనూ పెంచనుంది. మినీ మోడల్‌తో సహా అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 5 శాతం వరకూ పెంచనున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం తెలిపింది. ఈ పెరుగుదల ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ధరలను పెంచాలని నిర్ణయించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ చెప్పారు. ధరల పెరుగుదలకు కారణాలను వెల్లడించలేదు. అయితే రూపాయి పతనం కారణంగా దిగుమతి వ్యయాలు పెరిగిపోతుండటంతో కంపెనీ ధరలను పెంచుతోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కంపెనీ భారత్‌లో బీఎండబ్ల్యూ 3, 5, 6, 7 సిరీస్, ఎస్‌యూవీ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, స్పోర్ట్స్ కార్ ఎ సిరీస్ వంటి కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.28.6 లక్షల నుంచి రూ.1.73 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి. కాగా రూపాయి పతనం కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచే అవకాశాలున్నాయి. మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆడి గత నెల 15 నుంచే ధరలను 4 శాతం పెంచింది.