అయినా క్షమాపణ చెప్పేది లేదు!
న్యూఢిల్లీ: మహాత్మగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమన్న వ్యాఖ్యలపై పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పబోరని కాంగ్రెస్ స్పష్టంచేసింది. తన వాదనకు మద్దతుగా ఆయన చారిత్రక వాస్తవాలను, ఆధారాలను కోర్టు ముందు పెట్టబోతున్నారని తెలిపింది.
'రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడం లేదా, విచారం వ్యక్తం చేయడం అన్న ప్రసక్తే తలెత్తబోదు. ఆయన క్షమాపణ చెప్పాలన్న వాదనను గతంలోనే లేవనెత్తినా దానిని అంగీకరించలేదు. రాహుల్ పరిణతి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనకు చారిత్రక వాస్తవాలపై అవగాహన ఉంది. (ఆరెస్సెస్ పై) వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సరైన వేదిక ముందు సమర్థించుకోగలవు' అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మంగళవారం విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఇంతకుమించి స్పందించబోమని ఆయన చెప్పారు.
మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని, లేకపోతే ఈ విషయంలో పరువునష్టం కేసు ఎదుర్కొనక తప్పదని సుప్రీంకోర్టు రాహుల్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే.