indian Defence Force
-
ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ సైనిక బంకర్
బెంగళూరు: భారత రక్షణ మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ముద్రిత సైనిక బంకర్‌ను లేహ్‌లో నిర్మించారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అసాధారణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టవంతంగా మిలటరీ బంకర్‌ను పోతపోయడం విశేషం. అప్పటికప్పుడు తయారుచేసిన ప్రత్యేక కాంక్రీట్ మిక్సర్‌ను ముందే డిజైన్ చేసిన విధంగా 3డీ విధానంలో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇండియన్ ఆర్మీ తరఫున అరుణ్ కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)హైదరాబాద్‌తోపాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బహుళ సాంకేతికతలు, ఉత్పత్తుల అంకుర సంస్థ సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా ‘ప్రబల్’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బంకర్‌ను నిర్మించారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తు, అత్యల్ప ఆక్సిజన్(హ్యాలో) పరిస్థితుల్లో ప్రపంచంలో నిర్మించిన తొలి బంకర్ ఇదేనని ప్రబల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ‘‘అత్యంత మారుమూల ప్రదేశానికి ఈ ప్రింటర్‌ను తీసుకురావడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఇంత ఎత్తులో దాదాపు కేవలం 40–50 శాతం ఆక్సీజన్ అందుబాటులోనే మేం, మా ప్రింటర్ పనిచేయాల్సి వచ్చింది. శత్రుసైన్యం బుల్లెట్లను తట్టుకునేలా అధునాతన డిజైన్‌లో పటిష్టంగా, పరిసరాల్లో కలిసిపోయే రంగులో బంకర్‌ను నిర్మించాం’’ అని ఆయన వెల్లడించారు. గతంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని బురుగుపల్లి గ్రామంలో ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెండ్ హిందూ ఆలయాన్ని సైతం ఇదే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నిర్మించింది. -
రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ భారత రక్షణ దళాల నుంచి ఏకంగా 2,978 ఫోర్స్ గూర్ఖా వాహనాల కోసం ఆర్డర్ పొందింది. త్వరలోనే ఈ వాహనాలు రక్షణ శాఖలోకి చేరనున్నాయి. కంపెనీ ఈ కార్లను సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా తయారు చేయనుంది.ఫోర్స్ గూర్ఖా కార్లు.. ఇండియన్ ఆర్మీ, వైమానిక దళాలలో చేరనున్నాయి. ఈ కార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగల సత్తా, మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్లనే సైనిక దళాలకు ఉపయోగకరంగా ఉంటాయి. కంపెనీ లైట్ స్ట్రైక్ వెహికల్ (LSV) వేరియంట్ రక్షణ శాఖకు డెలివరీ చేయనున్నట్లు సమాచారం.భారతదేశంలో ఫోర్స్ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా (3-డోర్, 5-డోర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది), ఫోర్స్ ట్రావెలర్, ఫోర్స్ ట్రాక్స్, ఫోర్స్ అర్బానియా, ఫోర్స్ సిటీలైన్, ఫోర్స్ మోనోబస్ మొదలైనవి ఉన్నాయి. గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 138bhp, 320Nm ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. -
Spy Balloon: భారత్ గగనతలంపై స్పై బెలూనా? పైగా అమెరికా కంటే..
అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ వ్యవహారం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా రక్షణ వ్యవస్థకు సమీపంలో ఆ స్పై బెలూన్ ఉందంటూ కూల్చివేసింది. ఈ ఘటన జరిగిన నాలుగు వారాల తర్వాత భారత గగనతలంపై కూడా ఈ స్పై బెలూన్ ప్రత్యక్ష్యం అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అదీకూడా అమెరికా గగనతలంలో ప్రత్యక్ష కావడానికి ముందే గతేడాది ఈ స్పై బెలూన్ భారత్ గగనతలంలో కనిపించినట్లు అధికారుల చెబుతున్నారు. ఐతే తాము అది ఏమిటనేది గుర్తించలేకపోవడం, సరైన సమాచారం కూడా లేకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవులు భూభాగంలోని గగనతలంపై ఈ స్పైబెలూన్‌ని చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని తాము వాతావరణ బెలూన్లుగా భావించామని, అదీగాక అలాంటి వాతావరణ బెలూన్లు గాలుల కారణంగా పాకిస్తాన్ వైపు నుంచి బారత్ గగనతలంలోకి వస్తుంటాయని చెప్పారు. పైగా ఆ బెలూన్ ఏంటి అని తెలుసుకునేలోపే సముద్ర గగనతలం వైపుకి వెళ్లిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా చైనా నిఘా బెలూన్ వ్యవహారంతో తాము ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలిపారు. ఇక ఇలాంటి బెలూన్లు అండమాన్ లేదా మరే ఇతర ప్రాంతాల్లో కనిపించినా.. జాగ్రత్తగా పరిశీలించడమే గాక అది గూఢచర్యానికి చెందినదని తెలిస్తే కూల్చివేస్తామని చెప్పారు అధికారులు. ఆ నిఘా బెలూన్ కనిపించిన దీవులు భారత క్షిపణి పరీక్ష ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా భారత రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
సైనిక ‘రాజకీయం’ ప్రమాదకరం
సైన్యం నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు జాతీయ భద్రతా విధానం సర్వసమ్మతంగా అమలవుతుందని విశ్వసించటం కష్టం. రాజకీయాలకు, మతానికి, జెండర్‌కు, కులానికి, జాతి వివక్షకు అతీతంగా ఉంటూండటమే భారతీయ సైన్యం నిజమైన బలం. దేశ ప్రజలు సైన్యంపై అంతటి విశ్వాసాన్ని, ఆరాధనను ప్రదర్శించడానికి ఇదే కారణం. ఉన్నత స్థానాల్లోని సైన్యాధికారులు ఈ దృక్పథాన్ని, సైనిక జీవితాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో కొందరు సీనియర్ సైనికాధికారులు ఈ సూత్రాన్ని వదిలివేశారు. ఉన్నత ర్యాంకు కోసం తపిస్తూ, సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సైనిక వారసత్వ మనస్తత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది సైన్యం నైతిక ధృతికి అవరోధంగా మారుతుంది. యావత్ సైనిక బలగాలపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) సంబంధించిన తీవ్ర వివాదం మధ్య భారతదేశం ప్రస్తుతం చిక్కుకుపోయి ఉంది. అదే సమయంలో జాతీయ జనగణన నమోదు (ఎన్పీఆర్), అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియను ఖరారు చేయడానికి సంబంధించిన వార్తల్ని ప్రచారంలో పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తమ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న కొన్ని దేశాల సరసన భారత్ కూడా చేరడం విచారకరం. ఆఫ్రికా, యూరోప్, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా.. ఇలా ప్రపంచమంతటా ఇలాంటి ధోరణులు పొడసూపుతుండటం తెలిసిందే. ప్రజాందోళనలకు విభిన్న కారణాలు ఉండవచ్చు కానీ పాలకవర్గాలు తమ విధానాలను మార్చుకోవడంలో, పునరాలోచన చేయడంలో మొండివైఖరిని ప్రదర్శించడం అనే ఉమ్మడి లక్షణమే ఈ ఆందోళనలకు భూమిక. అయితే కొన్ని దేశాలు తమ ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని విధానాల్లో కొన్ని సవరణలను చేసుకుంటున్నాయి కానీ భారత ప్రభుత్వం మాత్రం ప్రజల డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గుతున్నట్లు కనిపించనందునే ప్రజాందోళనలపై, హింసాత్మక చర్యలపై భద్రతా బలగాల అణచివేత కొనసాగుతున్నాయి. బహుశా, పార్లమెంటులో అఖండ మెజారిటీ వల్లే పాలక పార్టీ తన సిద్ధాంతాలను ఎలాగైనా సరే ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నట్లుంది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం లభించడంతో తన విధానాలను ఏకపక్షంగా అమలు చేయాలని పాలకపక్షం సిద్ధమైంది. చాలా సందర్భాల్లో సంఖ్యాబలంలో చిన్నదిగా ఉన్న ప్రతిపక్షం అభిప్రాయాలను పెద్దగా లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనగణన ప్రాతిపదికన జరుగుతుందనే అంశంపై కేంద్రప్రభుత్వం పరస్పర విభిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నట్లు ఇటీవలి నివేదిక సూచిస్తోంది. ఎన్నార్సీకి అనుగుణంగానే ఎన్పీఆర్ ఉంటుందని రాజకీయ నేతలు ప్రకటిస్తుండగా ఎన్పీఆర్ తొలిదశగా ఉంటుందని ఎమ్హెచ్ఏ వార్షిక నివేదిక చెబుతోంది. ఇలా ప్రభుత్వ పక్షాన మారుతున్న విధానాలు ఆందోళనకారులకు హామీ ఇవ్వకపోగా, ప్రతికూల ప్రభావాలకు దారితీసి విశ్వాస భంగం కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఎదురుదాడి మొదలెట్టేసింది. తనకు తోడుగా ప్రాంతీయ, రాష్ట్ర పార్టీలను సమీకరిస్తోంది. ఈ విధాన సూత్రీకరణల ద్వారా తమ పౌరసత్వం ఎక్కడ పోతుందో అని ఏ భారతీయ పౌరులూ భయపడాల్సిన పనిలేదని హామీ ఇస్తోంది. రాజకీయ పార్టీల దృక్పథాలు విభిన్నంగా ఉండటంతో ప్రజల్లో విశ్వాసరాహిత్యం ప్రబలుతోంది. ఈ పరిస్థితిపై సాయుధబలగాలకు ఎలాంటి పాత్ర ఉండకూడదు. ఎందుకంటే సైన్యం పాత్ర, వారి కార్యాచరణ పక్కాగా నిర్వచించబడి ఉంది. రాజకీయ విన్యాసాలు రాజకీయ నేతలకు, పార్టీలకు మాత్రమే సంబంధించినవి కానీ సాయుధ బలగాలకు కాదు. 72 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మనం అనేక రాజకీయ పార్టీలు పాలించడం చూశాం. కానీ, ఒక విషయంలో మాత్రం ఇవి రెండు ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. ప్రజల డిమాండ్లను వింటాయి. తర్వాత వాటిని సవరిస్తాయి, నిర్లక్ష్యం చేస్తాయి, వదిలివేస్తాయి, అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా గతంలో ఇలాగే చేసింది. కానీ ఇటీవలికాలంలో ప్రజానుకూల చర్యలను ప్రధాన ఎన్నికలకు ముందు మాత్రమే ప్రకటించడం పార్టీలకు అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు మన సైనిక బలగాల విషయానికి వద్దాం. భారత సైన్యం లౌకికత్వానికి చెందిన ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి రాజకీయ పోరాటాలపై ఎలాంటి వైఖరి తీసుకోకూడదని రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రీకరణలను తు.చ. తప్పకుండా గౌరవిస్తుంటాయి. సైన్యం ఉదాహరణను విస్తరించి చూసినట్లయితే, వాయుసేన, నావికాబలగానికి చెందిన కమాండింగ్ ఆఫీసర్లకు చెందిన వివిధ స్థాయిల అధికారులు కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటాయి. వీరు మతపరమైన, లైంగికపరమైన ఎలాంటి వివక్షను పాటించరు. అలాగే కులాన్ని చూడరు, జాతి వివక్షను ప్రదర్శించరు. ఇదే మన సైన్యం బలం. భారత ప్రజలు సైన్యంపై అంతటి విశ్వాసాన్ని, అంత ఆరాధనను ప్రదర్శించడానికి ఇదే కారణం. ఉన్నత స్థానాల్లోని సైనికాధికారులు ఈ దృక్పథాన్ని, సైనిక జీవితాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో సీనియర్ సైనికాధికారులు ఈ సూత్రాన్ని వదిలివేశారు, పలుచన చేశారు కూడా. ఉన్నత ర్యాంకు కోసం తపిస్తూ, భౌతిక ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సైనిక వారసత్వపు మనస్తత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా సైనిక నైతిక ధృతికి, ప్రత్యేకించి సైనిక శిక్షణలో పెరిగిన జీవన దృక్పథానికి ఇవి అవరోధాలుగా మారుతున్నాయి. అత్యంత దయనీయమైన విషయం ఏమిటంటే, యావత్ సైనిక బలగాలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. సాధారణ ప్రజలకు సంబంధించినంతవరకు సొంత ప్రయోజనాల కంటే సైనికులు, వారి అధికారులు ప్రదర్శించే సేవా భావాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సమాచార యుగంలో దేశంలో ఏం జరుగుతోంది, వివిధ రాజకీయ పార్టీల రాజకీయ విన్యాసాలు ఎలా ఉంటున్నదీ సైనికులకు పూర్తి అవగాహన ఉంటోంది. అధికారం నిలుపుకోవడానికి, ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీలు ఏమేం చేస్తున్నది కూడా ఇప్పుడు సైన్యానికి బాగానే తెలుసు. ఈ నేపథ్యంలో పక్షపాత రాజకీయ వైఖరిని స్పష్టంగా ప్రదర్శిస్తున్న ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి విశ్వాసం ప్రకటించేలా సైన్యంలో కొందరు సీనియర్ అధికార్లు రాజకీయ ప్రభావాలకు గురవుతోందనిపిస్తోంది. రాజకీయాలకు అతీతమైన, పాక్షిక దృక్పథం లేని సైన్యం భారతీయ ప్రజాస్వామ్యాన్ని ఎత్తిపడుతుంది. భారతీయ సైన్యం వృత్తిగతతత్వానికి అది ప్రతీకగా ఉంటుంది. రాజ్యాంగం రీత్యా సైనిక బలగాలు ప్రజాస్వామికంగా ఎన్నికైన రాజకీయ నాయకత్వానికి పార్టీలతో పనిలేకుండా, నిష్పాక్షికంగా లోబడి ఉంటాయి. ఉండాలి కూడా. దీనివల్లే అధికారం శాంతియుతంగా మారినప్పుడల్లా ఎలాంటి సంక్షోభాలు లేకుండా ప్రభుత్వాలు గద్దెనెక్కగలుగుతున్నాయి. భారత ప్రజలు కూడా ఎలాంటి నిర్బంధ ప్రమాదం లేకుండా ఎవరు పాలించాలన్న ఎంపికను ఎంచుకోగలుగుతున్నారు. మరోమాటలో చెప్పాలంటే, సైన్యం ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే.. ప్రజలచేత ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు జాతీయ భద్రతా విధానపు విశ్వసనీయ అమలుపై ఆధారపడి పాలన సాగించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపార్టీలపై, సైన్యంపై, ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసం చెదిరిపోతుంది. రాజకీయాలకు అతీతమైన సైన్యం విభిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులను వారి సైద్ధాంతిక దృక్పథాలతో పనిలేకుండా సమానంగా గౌరవిస్తుంది. దీనికంటే మించి, సైనిక బలగాల నిర్వహణ రాజకీయ ప్రక్రియను బట్టి కాకుండా, పూర్తి వృత్తిగత నైపుణ్యంతో కొనసాగాలి. సైనిక వృత్తి ప్రాతిపదికపై ఉనికిలో ఉన్న నిబంధనలు, నియమావళిని ఇక్కడ నేను ప్రస్తావించదల్చుకోలేదు. వాటిగురించి అందరికీ తెలుసు, మీడియా ఇప్పటికే వాటిని చాలావరకు ప్రచారం చేసింది. ఇప్పుడు సాయుధ బలగాల సీనియర్ అధికారులు మీడియా ముందుకు వచ్చి, బహిరంగంగా ప్రభుత్వానుకూల రాజకీయ వైఖరులను ఎందుకు వ్యక్తపరుస్తున్నారు అన్నదే కీలకప్రశ్న. తాము ప్రాతి నిధ్యం వహిస్తున్న సాయుధ కమాండ్‌పై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కల్పిస్తుందన్న ఆలోచన కూడా లేకుండా వీరు ఇలాంటి వ్యవహారాలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమకు కల్పించిన అన్ని అవకాశాలకు కృతజ్ఞతగా తమ విశ్వాసాన్ని ఈ రకంగా ప్రదర్శించడానికి పూనుకుంటున్నారా? ప్రభుత్వానికి అనుకూలంగా బహిరంగంగా ఒకసారి సైన్యాధికారులు ప్రకటన చేశాక దానిపై తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చినా, తమ వ్యాఖ్యను సమర్థించుకునే ప్రయత్నాలు చేసినా దాని ప్రతికూల ప్రభావాన్ని ఎన్నటికీ తుడిచిపెట్టలేవు. సీని యర్ సైనికాధికారుల ప్రకటనలపై ఆధారపడటానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల వాణిని, వారి అభిప్రాయాలను పట్టించుకోవలసి ఉంది. వివిధ పార్టీలకు చెందిన విస్తృత ప్రజావర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాసకర్త : విజయ్ ఒబెరాయ్ , మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్,ఇండియన్ ఆర్మీ థింక్ టాంక్ సంస్థాపక డైరెక్టర్ -
‘రక్షణ’లో రాజీనా?
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కాగ్ నివేదిక ఉన్నప్పటికీ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు భారత రక్షణ ఒప్పందాల్లో అనుసరించిన విధానాలను మాత్రం ఘాటుగానే విమర్శించింది. అధికారంలో ఎవరున్నా.. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నాణ్యత లేని ఆయుధాలు భారత్‌కు వస్తున్నాయా? అన్న అనుమానం ప్రజల్లో ఎదురవుతోందని కాగ్ పేర్కొంది. సర్వసాధారణంగా రక్షణ ఒప్పందాల్లో నెలకొంటున్న లొసుగులను కాగ్ నివేదిక వివరించింది. వాయుసేన విధానాల్లో లోపాలు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలంటే భారత వాయుసేన తమ నిబంధనలు, వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి ఆయుధాలు ఉండాలో, ఎంత ధర ఉండాలో.. ఎంతమేరకు సైనిక అవసరాలున్నాయో ముందే స్పష్టంగా చెప్పాలి. కానీ వాయుసేనకి ఈ అంశాలపై స్పష్టత కొరవడింది. ఎయిర్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (ఏఎస్‌క్యూఆర్) సూత్రీకరణ విధానాలను మెరుగుపరచుకోకపోవడం వల్ల భారత్ పలు ఆయుధాల ఒప్పందాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అపాచి అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి 2015లో మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటికి బదులుగా రష్యాకు చెందిన మిల్ ఎంఐ–26 హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఉంటే భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదనే చర్చ జరుగుతోంది. యుద్ధ ప్రాంతాలకు సైనికుల్ని, ఆయుధాల్ని చేరవేయడంలో చినూక్ కంటే మిల్ ఎంఐ–26కున్న సామర్థ్యం రెట్టింపని కొందరి వాదన. వాయుసేన తన అవసరాలను తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం బోయింగ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రామాణిక ధరల్లో మార్పు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో సర్వసాధారణంగా ప్రభు త్వం ఒక ప్రామాణిక ధరను నిర్ణయించాలి. దానికి అనుగుణంగా వచ్చిన టెండర్లనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లని విప్పిచూసిన తర్వాత కూడా ఆ ధరల్ని మార్చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. డాప్లర్ వెదర్ రాడార్స్, అపాచి అటాక్ హెలికాఫ్టర్ల కొనుగోలులో అత్యంత కీలకమైన వాయుసేన ప్రమాణాలను (ఏఎస్‌క్యూఆర్) అమ్మకందారులు పాటించకపోయినప్పటికీ కాంట్రాక్టుల్ని అప్పగించారనే విమర్శలున్నాయి. బిడ్లు మార్చుకునే అవకాశం ఆయుధాల కొనుగోలుకు టెండర్లను పిలిచాక విక్రేతలు బిడ్ వేస్తే దాన్ని మార్చే చాన్స్ ఇవ్వకూడదు. కానీ యూపీఏ ప్రభుత్వం యథేచ్ఛగా ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే విమర్శలున్నాయి. 2012లో యూపీఏ హయాంలో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ కంపెనీకి బిడ్ మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని విపక్షాలు ఆరోపించాయి. అప్పుడప్పుడే విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన అతి చిన్న కంపెనీకి అలాంటి అవకాశం ఇవ్వడం వల్ల భారత్‌కు నాసిరకమైన విమానాలే వచ్చాయి. నిర్వహణ వ్యయంపై అవగాహన లేదు గతంలో.. ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని సంస్థ స్థాయిని చూడకుండా కొనుగోలు జరిగింది. వాటి నిర్వహణ వ్యయంపై ప్రభుత్వాలకు కనీస అంచనాలు ఉండకపోవడంతో భారీగా నష్టాలొచ్చాయి. స్విస్ పిలాటస్ విమానాల నిర్వహణ భారాన్ని మోయలేక.. వాటి వాడకాన్ని 2017లో మోదీ సర్కార్ నిలిపివేసింది. అదే ఆ విమానాల కొనుగోలుకు ముందే ఆలోచించి ఉంటే ఆర్థికంగా చాలా మేలు జరిగేది. ఒప్పందాల్లో జాప్యాలు.. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాలు కూడా మరో ప్రతికూల అంశమే. నాలుగు ఒప్పందాలకు మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, ఏడు ఒప్పందాలు కుదరడానికి అయిదేళ్ల కంటే ఎక్కువ పట్టింది. వివిధ స్థాయిల్లో అనుమతులు కావాల్సి ఉండడం, అధికారుల్లో నెలకొన్న అలసత్వం వల్లే ఈ జాప్యాలు జరుగుతున్నాయని కాగ్ నివేదిక విమర్శించింది. జాప్యాలతో ధరల భారం.. ఇలా సంవత్సరాల తరబడి జాప్యం జరగడం వల్ల ఆయుధాల ధరలు పెరిగిపోవడంతో.. దేశ ఖజానాపై అదనపు భారం పడుతోంది. రష్యా లేదా కామన్వెల్త్ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలులో ప్రతీ ఏడాది జాప్యానికి 5% ధర పెంచడానికి మన ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చింది. అదే యూరోపియన్ దేశాలకు 3.5% పెంచుకునేలా నిర్ణయించింది. కానీ మార్కెట్ ధరల్ని పరిశీలించి చూస్తే మన దేశం అనుమతించిన దానికి సగానికి సగం తక్కువగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ భారత్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రుషికొండ చేరిన ‘ఉభయచరం’
భారత రక్షణ దళంలో భాగంగా కోస్టుగార్డు అధికారులు సిద్ధం చేసిన కోస్టుగార్డు హోవర్‌క్రాఫ్ట్ హెచ్-193 నౌక సోమవారం విశాఖ ప్రాంతం రుషికొండ తీరానికి చేరింది. దీన్ని సముద్ర జలాలు, రోడ్డుపై కూడా నడపవచ్చు. మన దేశ సరిహద్దు జలాలు దాటి చొరబడిన శత్రు దేశాల యుద్ధ నౌకలు గుర్తిస్తుంది. సముద్రం అడుగులో మునిగిపోయిన, రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన నౌకల జాడ కనిపెడుతుంది. దీన్ని పూర్తిగా యునెటైడ్ కింగ్డమ్ సాంకేతిక నైపుణ్యంతో తయారు చేశారు. ఇది నీటిలో గంటకు 45 నాటికల్ మైళ్ల (540 కిలోమీటర్లు) వేగంతో దూసుకుపోతుంది. దీనిలో 13 మంది ఉండడానికి వీలుగా సీట్లు, సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులోనే డైనింగ్‌హాల్, బాత్రూమ్, మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంజన్ సామర్థ్యం 693 కిలోవాట్లు. ఇంజన్ కేబిన్‌లో నైట్‌విజన్ కెమెరాలు, రూట్‌మ్యాప్ ఏర్పాటు చేసి ఉన్నాయి. - న్యూస్‌లైన్, విశాఖపట్నం