సైన్యం నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు జాతీయ భద్రతా విధానం సర్వసమ్మతంగా అమలవుతుందని విశ్వసించటం కష్టం. రాజకీయాలకు, మతానికి, జెండర్‌కు, కులానికి, జాతి వివక్షకు అతీతంగా ఉంటూండటమే భారతీయ సైన్యం నిజమైన బలం. దేశ ప్రజలు సైన్యంపై అంతటి విశ్వాసాన్ని, ఆరాధనను ప్రదర్శించడానికి ఇదే కారణం. ఉన్నత స్థానాల్లోని సైన్యాధికారులు ఈ దృక్పథాన్ని, సైనిక జీవితాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో కొందరు సీనియర్ సైనికాధికారులు ఈ సూత్రాన్ని వదిలివేశారు. ఉన్నత ర్యాంకు కోసం తపిస్తూ, సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సైనిక వారసత్వ మనస్తత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది సైన్యం నైతిక ధృతికి అవరోధంగా మారుతుంది. యావత్ సైనిక బలగాలపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది.
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) సంబంధించిన తీవ్ర వివాదం మధ్య భారతదేశం ప్రస్తుతం చిక్కుకుపోయి ఉంది. అదే సమయంలో జాతీయ జనగణన నమోదు (ఎన్‌పీఆర్), అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియను ఖరారు చేయడానికి సంబంధించిన వార్తల్ని ప్రచారంలో పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తమ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న కొన్ని దేశాల సరసన భారత్ కూడా చేరడం విచారకరం. ఆఫ్రికా, యూరోప్, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా.. ఇలా ప్రపంచమంతటా ఇలాంటి ధోరణులు పొడసూపుతుండటం తెలిసిందే. ప్రజాందోళనలకు విభిన్న కారణాలు ఉండవచ్చు కానీ పాలకవర్గాలు తమ విధానాలను మార్చుకోవడంలో, పునరాలోచన చేయడంలో మొండివైఖరిని ప్రదర్శించడం అనే ఉమ్మడి లక్షణమే ఈ ఆందోళనలకు భూమిక. అయితే కొన్ని దేశాలు తమ ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని విధానాల్లో కొన్ని సవరణలను చేసుకుంటున్నాయి కానీ భారత ప్రభుత్వం మాత్రం ప్రజల డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గుతున్నట్లు కనిపించనందునే ప్రజాందోళనలపై, హింసాత్మక చర్యలపై భద్రతా బలగాల అణచివేత కొనసాగుతున్నాయి.
బహుశా, పార్లమెంటులో అఖండ మెజారిటీ వల్లే పాలక పార్టీ తన సిద్ధాంతాలను ఎలాగైనా సరే ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నట్లుంది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం లభించడంతో తన విధానాలను ఏకపక్షంగా అమలు చేయాలని పాలకపక్షం సిద్ధమైంది. చాలా సందర్భాల్లో సంఖ్యాబలంలో చిన్నదిగా ఉన్న ప్రతిపక్షం అభిప్రాయాలను పెద్దగా లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనగణన ప్రాతిపదికన జరుగుతుందనే అంశంపై కేంద్రప్రభుత్వం పరస్పర విభిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నట్లు ఇటీవలి నివేదిక సూచిస్తోంది. ఎన్నార్సీకి అనుగుణంగానే ఎన్‌పీఆర్ ఉంటుందని రాజకీయ నేతలు ప్రకటిస్తుండగా ఎన్పీఆర్ తొలిదశగా ఉంటుందని ఎమ్‌హెచ్‌ఏ వార్షిక నివేదిక చెబుతోంది. ఇలా ప్రభుత్వ పక్షాన మారుతున్న విధానాలు ఆందోళనకారులకు హామీ ఇవ్వకపోగా, ప్రతికూల ప్రభావాలకు దారితీసి విశ్వాస భంగం కలిగిస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే ఎదురుదాడి మొదలెట్టేసింది. తనకు తోడుగా ప్రాంతీయ, రాష్ట్ర పార్టీలను సమీకరిస్తోంది. ఈ విధాన సూత్రీకరణల ద్వారా తమ పౌరసత్వం ఎక్కడ పోతుందో అని ఏ భారతీయ పౌరులూ భయపడాల్సిన పనిలేదని హామీ ఇస్తోంది. రాజకీయ పార్టీల దృక్పథాలు విభిన్నంగా ఉండటంతో ప్రజల్లో విశ్వాసరాహిత్యం ప్రబలుతోంది. ఈ పరిస్థితిపై సాయుధబలగాలకు ఎలాంటి పాత్ర ఉండకూడదు. ఎందుకంటే సైన్యం పాత్ర, వారి కార్యాచరణ పక్కాగా నిర్వచించబడి ఉంది. రాజకీయ విన్యాసాలు రాజకీయ నేతలకు, పార్టీలకు మాత్రమే సంబంధించినవి కానీ సాయుధ బలగాలకు కాదు.
72 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మనం అనేక రాజకీయ పార్టీలు పాలించడం చూశాం. కానీ, ఒక విషయంలో మాత్రం ఇవి రెండు ముఖాలను ప్రదర్శిస్తుంటాయి. ప్రజల డిమాండ్లను వింటాయి. తర్వాత వాటిని సవరిస్తాయి, నిర్లక్ష్యం చేస్తాయి, వదిలివేస్తాయి, అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా గతంలో ఇలాగే చేసింది. కానీ ఇటీవలికాలంలో ప్రజానుకూల చర్యలను ప్రధాన ఎన్నికలకు ముందు మాత్రమే ప్రకటించడం పార్టీలకు అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు మన సైనిక బలగాల విషయానికి వద్దాం. భారత సైన్యం లౌకికత్వానికి చెందిన ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి రాజకీయ పోరాటాలపై ఎలాంటి వైఖరి తీసుకోకూడదని రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రీకరణలను తు.చ. తప్పకుండా గౌరవిస్తుంటాయి.
సైన్యం ఉదాహరణను విస్తరించి చూసినట్లయితే, వాయుసేన, నావికాబలగానికి చెందిన కమాండింగ్ ఆఫీసర్లకు చెందిన వివిధ స్థాయిల అధికారులు కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటాయి. వీరు మతపరమైన, లైంగికపరమైన ఎలాంటి వివక్షను పాటించరు. అలాగే కులాన్ని చూడరు, జాతి వివక్షను ప్రదర్శించరు. ఇదే మన సైన్యం బలం. భారత ప్రజలు సైన్యంపై అంతటి విశ్వాసాన్ని, అంత ఆరాధనను ప్రదర్శించడానికి ఇదే కారణం.
ఉన్నత స్థానాల్లోని సైనికాధికారులు ఈ దృక్పథాన్ని, సైనిక జీవితాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో సీనియర్ సైనికాధికారులు ఈ సూత్రాన్ని వదిలివేశారు, పలుచన చేశారు కూడా. ఉన్నత ర్యాంకు కోసం తపిస్తూ, భౌతిక ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సైనిక వారసత్వపు మనస్తత్వాన్ని వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా సైనిక నైతిక ధృతికి, ప్రత్యేకించి సైనిక శిక్షణలో పెరిగిన జీవన దృక్పథానికి ఇవి అవరోధాలుగా మారుతున్నాయి. అత్యంత దయనీయమైన విషయం ఏమిటంటే, యావత్ సైనిక బలగాలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది.
సాధారణ ప్రజలకు సంబంధించినంతవరకు సొంత ప్రయోజనాల కంటే సైనికులు, వారి అధికారులు ప్రదర్శించే సేవా భావాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సమాచార యుగంలో దేశంలో ఏం జరుగుతోంది, వివిధ రాజకీయ పార్టీల రాజకీయ విన్యాసాలు ఎలా ఉంటున్నదీ సైనికులకు పూర్తి అవగాహన ఉంటోంది. అధికారం నిలుపుకోవడానికి, ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీలు ఏమేం చేస్తున్నది కూడా ఇప్పుడు సైన్యానికి బాగానే తెలుసు. ఈ నేపథ్యంలో పక్షపాత రాజకీయ వైఖరిని స్పష్టంగా ప్రదర్శిస్తున్న ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి విశ్వాసం ప్రకటించేలా సైన్యంలో కొందరు సీనియర్ అధికార్లు రాజకీయ ప్రభావాలకు గురవుతోందనిపిస్తోంది. రాజకీయాలకు అతీతమైన, పాక్షిక దృక్పథం లేని సైన్యం భారతీయ ప్రజాస్వామ్యాన్ని ఎత్తిపడుతుంది. భారతీయ సైన్యం వృత్తిగతతత్వానికి అది ప్రతీకగా ఉంటుంది.
రాజ్యాంగం రీత్యా సైనిక బలగాలు ప్రజాస్వామికంగా ఎన్నికైన రాజకీయ నాయకత్వానికి పార్టీలతో పనిలేకుండా, నిష్పాక్షికంగా లోబడి ఉంటాయి. ఉండాలి కూడా. దీనివల్లే అధికారం శాంతియుతంగా మారినప్పుడల్లా ఎలాంటి సంక్షోభాలు లేకుండా ప్రభుత్వాలు గద్దెనెక్కగలుగుతున్నాయి. భారత ప్రజలు కూడా ఎలాంటి నిర్బంధ ప్రమాదం లేకుండా ఎవరు పాలించాలన్న ఎంపికను ఎంచుకోగలుగుతున్నారు. మరోమాటలో చెప్పాలంటే, సైన్యం ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే.. ప్రజలచేత ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు జాతీయ భద్రతా విధానపు విశ్వసనీయ అమలుపై ఆధారపడి పాలన సాగించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపార్టీలపై, సైన్యంపై, ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసం చెదిరిపోతుంది. రాజకీయాలకు అతీతమైన సైన్యం విభిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులను వారి సైద్ధాంతిక దృక్పథాలతో పనిలేకుండా సమానంగా గౌరవిస్తుంది. దీనికంటే మించి, సైనిక బలగాల నిర్వహణ రాజకీయ ప్రక్రియను బట్టి కాకుండా, పూర్తి వృత్తిగత నైపుణ్యంతో కొనసాగాలి. సైనిక వృత్తి ప్రాతిపదికపై ఉనికిలో ఉన్న నిబంధనలు, నియమావళిని ఇక్కడ నేను ప్రస్తావించదల్చుకోలేదు. వాటిగురించి అందరికీ తెలుసు, మీడియా ఇప్పటికే వాటిని చాలావరకు ప్రచారం చేసింది.
ఇప్పుడు సాయుధ బలగాల సీనియర్ అధికారులు మీడియా ముందుకు వచ్చి, బహిరంగంగా ప్రభుత్వానుకూల రాజకీయ వైఖరులను ఎందుకు వ్యక్తపరుస్తున్నారు అన్నదే కీలకప్రశ్న. తాము ప్రాతి నిధ్యం వహిస్తున్న సాయుధ కమాండ్‌పై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కల్పిస్తుందన్న ఆలోచన కూడా లేకుండా వీరు ఇలాంటి వ్యవహారాలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమకు కల్పించిన అన్ని అవకాశాలకు కృతజ్ఞతగా తమ విశ్వాసాన్ని ఈ రకంగా ప్రదర్శించడానికి పూనుకుంటున్నారా? ప్రభుత్వానికి అనుకూలంగా బహిరంగంగా ఒకసారి సైన్యాధికారులు ప్రకటన చేశాక దానిపై తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చినా, తమ వ్యాఖ్యను సమర్థించుకునే ప్రయత్నాలు చేసినా దాని ప్రతికూల ప్రభావాన్ని ఎన్నటికీ తుడిచిపెట్టలేవు. సీని యర్ సైనికాధికారుల ప్రకటనలపై ఆధారపడటానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల వాణిని, వారి అభిప్రాయాలను పట్టించుకోవలసి ఉంది. వివిధ పార్టీలకు చెందిన విస్తృత ప్రజావర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
వ్యాసకర్త : విజయ్ ఒబెరాయ్ , మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్,ఇండియన్ ఆర్మీ థింక్ టాంక్ సంస్థాపక డైరెక్టర్
సైనిక ‘రాజకీయం’ ప్రమాదకరం
Published Sat, Jan 4 2020 12:53 AM | Last Updated on Sat, Jan 4 2020 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment