
న్యూఢిల్లీ: తమ నేతలు చేసిన ‘గోలీ మారో’, ‘ఇండో పాక్ మ్యాచ్’ వంటి వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసి ఉండొచ్చని హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బీజేపీ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బావుండేదన్నారు. ‘టైమ్స్ నౌ’ వార్తా చానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని ఆయన అంగీకరించారు. అయితే, ఈ ఫలితాలను సీఏఏపై, ఎన్నార్సీపై ప్రజలిచ్చిన తీర్పుగా భావించకూడదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి ఎవరైనా తనతో చర్చించాలనుకుంటే.. అపాయింట్‌మెంట్ తీసుకుని తనను నేరుగా కలవవచ్చని షా తెలిపారు. అపాయింట్‌మెంట్ కోరిన మూడు రోజుల్లోగా వారికి సమయమిస్తామన్నారు.