Mark Carney
-
అమెరికాతో పాతబంధం ముగిసింది.. ప్రతిచర్య తప్పదు: మార్క్ కార్నీ
ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney). ఆటో ఉత్పత్తులపై సుంకాలు విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కార్నీ ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆటో ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తానంటూ ట్రంప్(Trump Tariffs) తాజాగా వ్యాఖ్యానించారు. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేసే కెనడా ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని కేబినెట్ భేటీ నిర్వహించారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లను అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అలాగే.. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడాకు ప్రధాని అయ్యారు. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడడం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్ వేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్‌తో మాట్లాడకపోవడం గమనార్హం. ట్రంప్‌తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని.. అయితే తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని కార్నీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాబోయే రెండు, మూడో రోజుల్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకోవచ్చని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. అసలు ఎవరీయన? -
కెనడా ఎన్నికల్లో అడ్వాంటేజ్ కార్నీ
కొన్నేళ్లుగా నానారకాలైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కెనడాలో ఎన్నికల నగారా మోగింది. లిబరల్ పార్టీ సారథి, నూతన ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ‘ముందస్తు’ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ దాకా ఆగకుండా ఏప్రిల్ 28వ తేదీనే ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ముమ్మర ప్రచారంతో దూసుకెళ్తున్నారు. విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా విజయంపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని కార్నీ భావిస్తున్నారు. ఇందుకు గట్టి కారణాలూ లేకపోలేదు. నిజానికి జస్టిన్ ట్రూడో పదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా దేశాన్ని ఆయన తిరోగమన బాట పట్టించారని వారంతా ఆగ్రహించారు. దాంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కన్జర్వేటివ్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అంతా భావించారు. కానీ మూడు నెలలుగా పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో లిబరల్ పార్టీపై ప్రజల ఆగ్రహావేశాలు చల్లార్చినట్టు కన్పిస్తోంది. దానికితోడు కెనడాను అడుగడుగునా అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిపోయింది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్‌కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షునితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కార్నీ ప్రధాన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ నేత పొలియెవ్రాకు ట్రంప్ సమర్థకునిగా పేరుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగోసారి తమ గెలుపు లాంఛనమేనని లిబరల్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కెనడాలో గత పదేళ్లలో జస్టిస్ ట్రూడో లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. మార్క్ కార్నీ 60 ఏళ్ల కార్నీ వృత్తిరీత్యా బ్యాంకర్. బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు కూడా చీఫ్‌గా పని చేసిన ఘనత ఆయనది. అయితే రాజకీయాలకు మాత్రం పూర్తిగా కొత్త. కనీసం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా లేకున్నా కొద్ది రోజల క్రితమే అనూహ్యంగా ఏకంగా ప్రధాని అయిపోయారు. అలా ప్రధాని హోదాలో ఎన్నికల అరంగేట్రం చేస్తున్న నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రూడో గద్దె దిగాక లిబరల్ పార్టీ సారథ్య ఎన్నికల్లో ఏకంగా 85 శాతం మంది కార్నీకే ఓటేయడం విశేషం. ఉత్తర కెనడా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ కొద్ది రోజుల్లోనే వరుస నిర్ణయాలతో కార్నీ మంచి దూకుడు కనబరిచారు. ట్రంప్‌పై ఆయన కఠిన వైఖరి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను కార్నీ తూర్పారబట్టారు. కెనడా సార్వబౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతానని ప్రకటించారు. కెనడాపై ట్రంప్ సుంకాలకు దీటుగా అమెరికా మీద వెంటనే ప్రతీకార సుంకాలకు తెర తీసి ప్రజల మన్నన చూరగొన్నారు. నానా సమస్యలు ఎదుర్కొంటున్న దేశాన్ని ఈ ఆర్థిక నిపుణుడు గాడిలో పెడతారని వారు నమ్ముతున్నారు. నలుగురు అభ్యర్థుల్లో కార్నీయే మెరుగని ప్రజలు భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతుండటం విశేషం. ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రచార సభకు విశేషాదరణ లభించింది. ‘‘ట్రంప్ రూపంలో కెనడా తన చరిత్రలోనే అతి పెద్ద ముప్పు ఎదుర్కొంటోంది. దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు నాకు భారీ మెజారిటీ ఇవ్వండి’’ అంటూ కార్నీ ఇచ్చిన పిలుపునకు జనం విపరీతంగా స్పందించారు. పియే పొలియెవ్రా 45 ఏళ్ల పొలియెవ్రా కన్జర్వేటివ్ పార్టీ సారథి. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన యువ నేత. 25 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కునిగా నిలిచారు. ట్రూడో విధానాలకు తీవ్ర వ్యతిరేకి. దేశ సమస్యలన్నింటికీ అవే కారణమని నిత్యం విమర్శిస్తుంటారు. ధరల పెరుగుదల నుంచి హౌసింగ్ సంక్షోభం దాకా నానా ఇక్కట్లతో సతమతమవుతున్న కెనడావాసులను దూకుడైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ వచ్చారు. ఏడాదిన్నర క్రితం దాకా అన్ని సర్వేల్లోనూ హాట్ ఫేవరెట్‌గా నిలిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొలియెవ్రా ప్రధాని కావడం లాంఛనమేనని అంతా భావించిన పరిస్థితి! కానీ కార్నీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ట్రంప్ సమర్థకుడన్న పేరు కూడా పొలియెవ్రాకు చేటు చేస్తోంది. దాంతో ఆయన కూడా ట్రంప్‌పై విమర్శలకు దిగుతుండటమే గాక ‘కెనడా ఫస్ట్’ నినాదం ఎత్తుకున్నారు. అయితే ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రసంగానికి అంతంత స్పందనే లభించింది.జగ్మిత్ సింగ్ భారత సంతతికి చెందిన 46 ఏళ్ల జగ్మిత్ వామపక్ష న్యూ డెమొక్రటిక్ పార్టీ సారథి. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి మైనారిటీ నేతగా రికార్డులకెక్కారు. ఎన్డీపీ 2021 నుంచి ట్రూడో ప్రభుత్వానికి మూడేళ్ల మద్దతిచ్చి దాని మనుగడకు కీలకంగా నిలిచింది. 2024లో మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీ పెద్ద ప్రభావం చూపబోదని సర్వేలు పేర్కొన్నాయి. దానికి 9% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్టు తేల్చాయి. పార్టీకి అధికారిక గుర్తింపును నిలుపుకోవడమే ఎన్డీపీకి సవాలుగా మారవచ్చంటున్నారు. బ్లాక్ క్యుబెక్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఫ్రానోయిస్ బ్లాంచెట్ బరిలో ఉన్నారు. క్యూఎన్పీ పోటీ ఫ్రెంచి ప్రాబల్య ప్రాంతాలకే పరిమితమైంది. జగ్మిత్, బ్లాంచెట్ పోటీ నామమాత్రమేనని భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు
ఒట్టావా: కెనడాలో ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 28న ముందస్తు పోలింగ్ జరపనున్నట్లు ఆదివారం కెనడా ప్రధానమంత్రి కార్నీ ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగడంతో రెండు వారాల క్రితమే కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆదివారం ఆయన గవర్నర్ జనరల్‌తో భేటీ అయి పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అక్టోబర్ 20న ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార లిబరల్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కార్నీ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. -
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ
-
Mark Carney: అమెరికాలో కెనడా విలీనం.. ఏనాటికీ కాబోదు
ఆర్థిక మేధావి, కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ.. బాధ్యతలు చేపట్టకముందే అమెరికాతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారా?!. రాబోయే రోజుల్లోనూ డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమవుతున్నారా?. తాజా విక్టరీ స్పీచ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామంటున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు.. మార్క్ కార్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అధికార లిబరల్ పార్టీ ఆదివారం మార్క్ కార్నీ(Mark Carney)ని తమ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సుమారు 86 శాతం సభ్యుల ఓట్లతో.. భారీ మెజార్టీతో ఆయనకు విజయం కట్టబెట్టింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టరీ స్పీచ్‌లో కార్నీ ఏమన్నారంటే.. అమెరికా కెనడా కాదు. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు. ఇతర దేశాలతో మేం(కెనడా) ఏ రకమైనా పోరాటం కోరుకోవడం లేదు. కానీ, .. అవతలివాళ్లు స్నేహ హస్తం వదులుకోవాలనుకుంటే మాత్రం.. మేమూ అందుకు సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి.. అమెరికన్లు ఎలాంటి తప్పు చేయకూడదనే నేను కోరుకుంటున్నా. అది వాణిజ్యంలో అయినా.. హకీలో అయినా.. కెనడాదే పైచేయి అనే విషయం మరిచిపోకూడదు’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: కెనడా కొత్త ప్రధాని.. మామూలోడు కాదండోయ్!ఈ క్రమంలో అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాల(US Canada Tariff Hikes) విధింపు కొనసాగుతుందని ప్రకటించారాయన. ‘‘అమెరికన్లు మమ్మల్ని కాస్త గౌరవించాలి. వాణిజ్య ఒప్పందాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’’ అని కోరారు. అలాగే.. తన విజయ ప్రసంగంలో దేశ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడిన ఆయన.. కెనడాను ఎనర్జీ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతానని, అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు.ఇదిలా ఉంటే కార్నీ తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. ఏమాత్రం రాజకీయ, పాలనానుభవం లేని మార్క్ కార్నీ దూకుడుగా కాకుండా ఆచితూచీ అడుగులేయాలని సూచిస్తున్నారు. లేకుంటే.. పరిస్థితులు చేజారిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.