tomcom
-
మన యువతకు జపాన్‌లో ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైపుణ్యం ఉన్న యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా అక్కడి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌లో అధిక ఉద్యోగావకాశాలున్న రంగాలను గుర్తించి, ఆయా ఉద్యోగాలకు తెలంగాణ యువతను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)’ ద్వారా పంపించడానికి వీలుగా అక్కడి రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.జపాన్‌కు చెందిన టెర్న్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో టామ్‌కామ్ శనివారం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతకుముందు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కాగా టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో నియామకాలు చేపడుతుంది.ఇక రాజ్ గ్రూప్ జపాన్‌లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ త్సుకుయి కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గతంలో టామ్‌కామ్‌తో కలిసి పని చేసింది. తాజా ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంలో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది. ఈ రెండు జపనీస్ సంస్థలు రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువతకు అందించనున్నాయి.హెల్త్‌కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ రంగంలో (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ) 100 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థల ప్రతినిధులు వివరించారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు: సీఎం తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, త్వరలోనే తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. టోక్యోలోని తెలుగు సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్‌ను పరిశీలించామని, తాము రాష్ట్రంలో మూసీ నది ప్రక్షాళన చేయాలని భావిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని చెప్పారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్తంభించే పరిస్థితులు ఉత్పన్నం అవుతుంటే, అది చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అని సీఎం ప్రశ్నించారు.మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆర్ కీలకం‘హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నా. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి. పరిశ్రమలు పెరగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగితే ప్రపంచంతోనే మనం పోటీ పడొ చ్చు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆ నందం ఏమిటో మీకు తెలుసు..’ అని రేవంత్ అన్నారు. -
విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి శుభవార్త
మోర్తాడ్(బాల్కొండ): విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) శుభవార్త అందించింది. ఏజెంట్ల మోసాలను అరికట్టడంలో భాగంగా విదేశాల్లోని కంపెనీలకు, వలస కార్మి మకులకు ప్రభుత్వరంగ సంస్థనే మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గతంలో కేవలం గల్ఫ్ దేశాల వీసాలను ఇప్పించిన టామ్‌కామ్ కొన్ని నెలల నుంచి పాశ్చాత్య దేశాల్లోనూ యువతకు ఉపాధి బాటలు వేస్తోంది. ఇజ్రాయెల్, జర్మనీ వీసాల జారీతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిన టామ్‌కామ్ తాజాగా సౌదీ అరేబియా, గ్రీస్, సింగపూర్ దేశాల్లో ఉపాధి చూపనుంది. ఆసక్తి ఉన్నవారు టామ్కామ్ను సంప్రదిస్తే అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. సౌదీ అరేబియాలో వేర్‌హౌజ్‌లలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్ చదివిన అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్‌కు సంబంధించి బేసిక్ నాలెడ్జి ఉండాలని టామ్‌కామ్ సూచించింది. 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులకు వేర్‌హౌజ్‌లలో ఉపాధి కల్పించనున్నారు. మన కరెన్సీలో రూ.40 వేల వేతనం ఉచిత వసతి, రవాణా సదుపాయం కూడా కంపెనీనే కల్పిస్తుంది. అభ్యర్థులకు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు తప్పనిసరి అనే నిబంధన ఉంది. గ్రీస్‌లో ఉపాధి పొందాలనుకునే మహిళలకు హౌస్‌కీపింగ్, బార్ అండ్ రెస్టారెంట్లలో వెయిటర్లుగా పనిచేయడానికి యువతీ యువకులకు అవకాశం ఉంది. మన కరెన్సీలో రూ.1.02 లక్షల వేతనం వస్తుంది. అభ్యర్థుల వయస్సు 18–45 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా, డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మగవారికైతే ఎల్రక్టీషియన్, కార్పెంటర్, ప్లంబర్, టైల్స్, మార్బుల్ మేషన్లకు ఉపాధి కల్పిస్తారు. వీరికి కూడా వేతనం రూ.1.02 లక్షల వరకు ఉంది. గార్డెనింగ్, క్లీనర్లుగా పని చేసేవారికి రూ.88 వేల వరకు వేతనం చెల్లిస్తారు. గ్రీస్‌లో కార్మిక చట్టాలను అనుసరించి ఓవర్‌టైం పని కల్పించనున్నారు.చదవండి: చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం సింగపూర్‌లో ప్లాస్టర్ మేషన్, స్టీల్ ఫిక్సర్ రంగాల్లో కూడా ఉపాధి కల్పిస్తారు. ఆయా రంగాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు 45 ఏళ్ల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని టామ్‌కామ్ వెల్లడించింది. మన కరెన్సీలో రూ.29 వేల నుంచి రూ.31 వేల వేతనం చెల్లిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు టామ్‌కామ్ ఈమెయిల్‌కు వివరాలను పంపించాల్సి ఉంటుంది. టామ్‌కామ్ కార్యాలయమున్న ఐటీఐ మల్లెపల్లి హైదరాబాద్ క్యాంపస్‌లో స్వయంగా 94400 50951/49861/51452 నంబర్లలో సంప్రదించవచ్చని జనరల్ మేనేజర్ నాగభారతి వెల్లడించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ టామ్‌కామ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో ఎలాంటి మోసానికి తావు ఇవ్వకుండా వీసాల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
టామ్‌కామ్ చైర్మన్‌గా బోయపల్లి రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కాం) చైర్మన్‌గా బోయపల్లి రంగారెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన రంగారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, బ్యాంకు ఉద్యోగి గా పని చేశారు. 1969 తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాలుపంచు కున్నారు. 2009 నుంచి టీఆర్ఎస్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. -
టామ్‌కామ్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు
- వరంగల్ మెగా ఉద్యోగ మేళాలో మంత్రి నాయిని వరంగల్: విదేశాలల్లో ఉద్యోగాలు చేయగోరేవారు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ను మాత్రమే సంప్రదించాలని, ప్రైవేట్ ఏజెన్సీల చేతిలోపడి మోసపోవద్దని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి బుధవారం వరంగల్‌లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆయన.. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదనే విమర్శలు అర్థరహితమన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని నాయిని అన్నారు. ములుగు రోడ్డులోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
సౌదీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వేతనం 50 వేలు!
రంగారెడ్డి జిల్లా: సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థ టామ్‌కమ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని సంస్థ ఎండీ కేవై నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అనస్తీషియా టెక్నీషియన్, నర్సు, అసిస్టెంట్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మెడికల్ కోడర్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్ తదితర కొలువుల్లో 156 ఖాళీలున్నాయన్నారు. ఈ ఉద్యోగాలకు సగటున రూ.50 వేల వేతనంతోపాటు నివాసం, భోజనం, రవాణా వసతి సౌకర్యాలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసుకున్న కంపెనీ భరిస్తుందన్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు పాస్‌పోర్టు లేనప్పటికీ.. సదరు కంపెనీ ఈ సౌకర్యాన్ని సమకూరుస్తుందని, అర్హతలున్న అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో మెహిదీపట్నంలోని జీ పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
టామ్‌కామ్ ద్వారానే దుబాయ్ ఉద్యోగాలు
వెబ్ పోర్టల్ ఆవిష్కరించిన మంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లాలనుకునే కార్మికులందరినీ ఇకపై తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ద్వారానే పంపిస్తామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నకిలీ వీసాలతో, తప్పుడు పద్ధతుల ద్వారా వెళ్లి అక్కడ ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సచివాలయంలో మంగళవారం టామ్‌కామ్ వెబ్ పోర్టల్‌ను మంత్రి ఆవిష్కరించారు. ‘గల్ఫ్ దేశాలలో పనిచేయాలనుకొనేవారు టామ్‌కామ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే అర్హులు. రిజిస్టర్ చేసుకున్నవారికి గల్ఫ్ దేశాల్లో అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఈ ఏడాది వెయ్యి మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఏడాది 5 వేల మందిని పంపడమే లక్ష్యం’ అని నాయిని వెల్లడించారు. దుబాయ్‌లో తెలంగాణకు చెందిన కార్మికులు అత్యధికంగా ఉన్నారని, వారు ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తారని కంపెనీల యాజమాన్యాలు మెచ్చుకొంటున్నాయన్నారు. ఇక్కడి నుంచి ఎంత మందిని పంపించినా అక్కడ ఉద్యోగాలిస్తామని యాజ మాన్యాలు చెప్పాయన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ జీఎం భవానీ పాల్గొన్నారు.