Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pahalgam Incident: Pakistan International Inquiry Drama1
పహల్గాం ఘటన.. పాక్‌ కపట నాటకం

ఇస్లామాబాద్‌: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్‌ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ అసిఫ్‌(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్‌ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్‌ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్‌ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్‌ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్‌ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో అసిఫ్‌ స్పందించారు. పాక్‌లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్‌లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్‌ ప్రమేయం ఉందని భారత్‌ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్‌ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ అసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జమ్ము కశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్‌ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్‌ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్‌ వ్యాఖ్యానించారు.

ACB Raids On Kaleshwaram Project  Ex ENC Hari Ram2
కాళేశ్వరంలో కీలక పాత్ర.. మాజీ ఇరిగేషన్‌ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరిగేషన్‌ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు.. సోదాఉ చేపట్టారు. అయితే, హరిరాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు. ఇక, ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్‌లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్‌ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఇక, ఎన్‌డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్‌ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్‌ ఎందుకూ పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌ తేల్చిందని.. వచ్చే కేబినెట్‌లో ఎన్‌డీఎస్‌ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్‌ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్‌ఎస్‌ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్‌గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.

Construction costs of five iconic towers have skyrocketed3
అవినీతి 'ఐకానిక్‌'!

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్‌ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్‌ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్‌ టవర్ల టెండర్లలో భారీ గోల్‌మాల్‌ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్‌లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్‌ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్‌ (నిలువు కాంక్రీట్‌ దిమ్మెలు), బీమ్స్‌ (అడ్డు కాంక్రీట్‌ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్‌ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేస్తారు. ఐకానిక్‌ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ డిజైన్‌ చేసింది. డయాగ్రిడ్‌ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్‌ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్‌ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్‌ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్‌డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్‌ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్‌ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్‌ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికార­వర్గాలు వ్యాఖ్యాని­స్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధా­రాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చే­తులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యా­యి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీ­షన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పు­డు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌– జెనిసిస్‌ ప్లానర్స్‌–డిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్‌డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాల­యాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించను­న్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు అప్పగించింది.

Trump Key Announcement On Russia-Ukraine Peace Talks4
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్‌ కీలక ప్రకటన

రోమ్‌: ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రోమ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్‌లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్‌(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్‌ విట్కాఫ్‌తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎ‍ట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్‌ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ట్రంప్‌​ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్‌స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్‌ బిలియనీర్‌ అయిన స్టీవ్‌ విట్‌కాఫ్‌(Steve Witkoff).. ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్‌ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్‌ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్‌హౌజ్‌ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్‌పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్‌ అంత్యక్రియలకు జెలెన్‌స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్‌కాఫ్‌తో పుతిన్‌ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్‌ యరోస్లావ్‌ మోస్కాలిక్‌ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్‌ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్‌ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్‌ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్‌పై, అటు జెలెన్‌స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Pakistan Army Violates LoC Ceasefire Again5
బోర్డర్‌లో పాక్‌ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్‌!

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌ ఆ‍ర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పులు జరుపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పాక్‌ ఆర్మీ మరోసారి.. నియంత్రణ రేఖ(LOC) వెంబడి కాల్పుల జరిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్‌ చర్యలను తిప్పికొట్టింది.వివరాల ప్రకారం.. భారత్‌, పాక్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ(LOC) వద్ద పాక్‌ ఆర్మీ శుక్రవారం రాత్రి కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత చెక్‌పోస్టుల వద్ద రెచ్చగొట్టే ధోరణితో కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ చెక్‌పోస్టులను టార్గెట్‌ చేసి ఫైరింగ్‌ చేసింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత ఆర్మీ వెల్లడించింది. ఏప్రిల్‌ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. అలాగే, ఏప్రిల్‌ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్‌ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.On the night of the 25th-26th of April 2025, unprovoked small firing was carried out by various Pakistan Army posts all across the Line of Control in Kashmir. Indian troops responded appropriately with small arms. No casualties reported: Indian Army pic.twitter.com/B6lO5oldJ2— ANI (@ANI) April 26, 2025మరోవైపు.. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కోయిమాహ్‌లోని తోకిర్‌పురాకు చెందిన వారిగా గుర్తించారు. J&K | Two Terrorist associates arrested by security forces in Thokerpora in Qaimoh area of Kulgam district: Police Sources pic.twitter.com/KstcuocVek— ANI (@ANI) April 26, 2025ఇదిలా ఉండగా.. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ​యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది దేశం అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

Pakistan airspace closure to hit Indian carriers as flight durations6
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం

పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్‌ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్‌ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్‌ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్‌ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్‌ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్‌ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్‌ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్‌ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్‌ చెప్పారు. ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ఒకరు తెలిపారు. కనెక్టింగ్‌ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్‌ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్‌ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్‌ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్‌ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్‌ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్‌ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్‌ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్‌ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్‌ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్‌ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్‌డేట్స్‌ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను తరచూ చెక్‌ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్‌ ఉండాలి. → ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sunrisers Hyderabad beat CSK by 5 wickets7
గెలిచి నిలిచిన రైజర్స్‌

చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్‌తో సూపర్‌ కింగ్స్‌ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్‌ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్‌కు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్‌ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్‌కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్‌ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్‌ 5 వికెట్లతో సీఎస్‌కేపై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఆయుశ్‌ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్షల్‌ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్రెవిస్‌ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (0) అవుట్‌ కావడంతో చెన్నై ఇన్నింగ్స్‌ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్‌ తరహాలో ఆయుశ్‌ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్‌ కరన్‌ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్‌ కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షల్‌ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్‌ చేయగా... సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న బ్రెవిస్‌ మాత్రం కమిందు బౌలింగ్‌లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్‌ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్‌ బాదిన బ్రెవిస్‌ తర్వాతి బంతికి కమిందు మెండిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. శివమ్‌ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన అన్షుల్‌ కంబోజ్‌ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్‌ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్‌ కిషన్‌... ఛేదనలో సన్‌రైజర్స్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్‌ శర్మ (0) అవుట్‌ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్‌ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ (7) విఫలం కావడంతో రైజర్స్‌ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్‌ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్‌ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్‌ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) అభిషేక్‌ (బి) షమీ 0; ఆయుశ్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) కమిన్స్‌ 30; స్యామ్‌ కరన్‌ (సి) అనికేత్‌ (బి) హర్షల్‌ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్‌ (సి) కమిందు (బి) హర్షల్‌ 42; శివమ్‌ దూబే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 12; హుడా (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 22; ధోని (సి) అభిషేక్‌ (బి) హర్షల్‌ 6; అన్షుల్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 2; నూర్‌ (సి) షమీ (బి) హర్షల్‌ 2; ఖలీల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్‌: షమీ 3–0–28–1, కమిన్స్‌ 4–0–21–2, ఉనాద్కట్‌ 2.5–0–21–2, హర్షల్‌ పటేల్‌ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్‌ 3–0–26–1. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) ఆయుశ్‌ (బి) ఖలీల్‌ 0; హెడ్‌ (బి) కంబోజ్‌ 19; ఇషాన్‌ కిషన్‌ (సి) కరన్‌ (బి) నూర్‌ 44; క్లాసెన్‌ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్‌ (సి) హుడా (బి) నూర్‌ 19; కమిందు (నాటౌట్‌) 32; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–21–1, కంబోజ్‌ 3–0–16–1, నూర్‌ అహ్మద్‌ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్‌ కరన్‌ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X పంజాబ్‌ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Pakistani actress Mahira Khan condemns Pahalgam Incident8
పహల్గామ్‌ ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ నటి.. నెటిజన్ల ఆగ్రహం!

2017లో రాయిస్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్‌. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్‌కు చెందిన నటులు ఫవాద్‌ ఖాన్‌తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్‌ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్‌ తన పోస్ట్‌ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్‌ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్‌ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్‌ ఖాన్‌ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్‌ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్‌ గులాల్‌' (Abir Gulaal Movie)ను భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ హీరోగా నటించగా.. బాలీవుడ్‌ హీరోయిన్‌ వాణీ కపూర్‌ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్‌, ఫరీదా జలాల్‌, పర్మీత్‌ సేతి, సోనీ రజ్దాన్‌ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్‌. బగ్దీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను వివేక్‌ అగర్వాల్‌, అవంతిక హారి, రాకేశ్‌ సిప్పీ, ఫిరూజీ ఖాన్‌ నిర్మించారు.

EPFO simplifies PF account transfer process on job change9
పీఎఫ్‌ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌!

న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్‌) ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్‌ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్‌ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్‌ జమలు జరిగిన (సోర్స్‌) ఆఫీస్‌. ఈ మొత్తం మరో ఈపీఎఫ్‌ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్‌ ఆఫీస్‌)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్‌ల బదిలీకి డెస్టినేషన్‌ ఆఫీస్‌ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్‌ 13 సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్‌లకు సోర్స్‌ ఆఫీస్‌ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్‌ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

Rain Forecast To Telangana For Five Days10
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..

సాక్షి స్పెషల్‌ డెస్క్, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్‌ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్‌లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్‌ మందును లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement