Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pahalgam Incident: Pakistan International Inquiry Drama1
పహల్గాం ఘటన.. పాక్‌ కపట నాటకం

ఇస్లామాబాద్‌: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్‌ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ అసిఫ్‌(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్‌ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్‌ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్‌ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్‌ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్‌ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో అసిఫ్‌ స్పందించారు. పాక్‌లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్‌లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్‌ ప్రమేయం ఉందని భారత్‌ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్‌ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ అసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జమ్ము కశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్‌ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్‌ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్‌ వ్యాఖ్యానించారు.

ACB Raids On Kaleshwaram Project  Ex ENC Hari Ram2
కాళేశ్వరంలో కీలక పాత్ర.. మాజీ ఇరిగేషన్‌ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరిగేషన్‌ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు.. సోదాఉ చేపట్టారు. అయితే, హరిరాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు. ఇక, ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్‌లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్‌ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఇక, ఎన్‌డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్‌ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్‌ ఎందుకూ పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌ తేల్చిందని.. వచ్చే కేబినెట్‌లో ఎన్‌డీఎస్‌ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్‌ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్‌ఎస్‌ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్‌గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.

US Donald Trump key Comments Over India And Pakistan3
భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా రోమ్‌ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతపై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్‌ అంటే నాకు ఎంతో గౌరవం. అలాగే పాకిస్తాన్‌ కూడా నాకు చాలా దగ్గర. రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటాను. కశ్మీర్‌ విషయంలో భారత్‌, పాక్‌ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | On #PahalgamTerroristAttack, US President Donald Trump says, "I am very close to India and I'm very close to Pakistan, and they've had that fight for a thousand years in Kashmir. Kashmir has been going on for a thousand years, probably longer than that. That was a bad… pic.twitter.com/R4Bc25Ar6h— ANI (@ANI) April 25, 2025అంతకుముందు ట్రంప్‌.. కశ్మీర్‌ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో భారత్‌ అంశంపై ప్రశ్నించిన పాక్‌ జర్నలిస్టుకు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఘటన తర్వాత భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్‌ను ఓ పాక్‌ జర్నలిస్టు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌, మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని కోరుకుంటాను. పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌పై ఎటువంటి పొజిషన్‌ తీసుకోలేదు’ అని పేర్కొన్నారు.

IPL 2025 SRH vs CSK: Dhoni Furious After 7th Defeat Slams Batters Kept Losing4
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కథ దాదాపు ముగిసినట్లే!.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (CSK vs SRH)తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్‌ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) స్పందించాడు.తమ పరాజయానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. చెపాక్‌ వికెట్‌ మీద తమ వాళ్లు బ్యాట్‌ ఝులిపించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది.బ్రెవిస్‌ ఒక్కడేఓపెనర్లలో షేక్‌ రషీద్‌ డకౌట్‌ కాగా.. ఆయుశ్‌ మాత్రే (19 బంతుల్లో 30) రాణించాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (21), దీపక్‌ హుడా (22) ఫర్వాలేదనిపించగా.. కొత్తగా జట్టుతో చేరిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. ఈ సౌతాఫ్రికా స్టార్‌ 25 బంతుల్లో 42 పరుగులతో సీఎస్‌కే టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.రైజర్స్‌ గెలిచి నిలిచిందికెప్టెన్‌ ధోని (6) సహా మిగతా వాళ్లంతా విఫలం కావడంతో చెన్నై 19.5 ఓవర్లలోనే కేవలం 154 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రైజర్స్‌ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడిన తొమ్మిదింట చెన్నైకి ఇది ఏడో పరాజయం.మా వాళ్లు విఫలంఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ మరీ అంత కఠినంగా ఏమీ లేదు. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ పిచ్‌ మీద 155 పరుగుల స్కోరు చెప్పుకోదగ్గది కానేకాదు. అసలు వికెట్‌ ఎక్కువగా టర్న్‌ కాలేదు.అయితే, 8-10 ఓవర్ల తర్వాత పిచ్‌ స్వభావం కాస్త మారింది. అయినా సరే పరుగులు రాబట్టేందుకు ఆస్కారం ఉన్నా మేము ఆ పని చేయలేకపోయాం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ స్పిన్నర్లకు సహకరించింది.మా వాళ్లు నాణ్యంగానే బౌలింగ్‌ చేశారు. సరైన సమయంలో వికెట్లు తీశారు. కానీ మేము ఇంకో 15- 20 పరుగులు చేసి ఉంటే.. వాళ్లు సులువుగా పని పూర్తి చేసేవారు’’ అని పేర్కొన్నాడు.ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతేఇక డెవాల్డ్‌ బ్రెవిస్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. మాకు మిడిలార్డర్‌లో అలాంటి ఆటగాడే కావాలి. స్పిన్నర్లు బరిలోకి దిగినప్పుడు మా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.అలాంటి సమయంలో బ్రెవిస్‌ లాంటి వాళ్లు నిలదొక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ధోని తెలిపాడు. ఏదేమైనా జట్టులో ఒకరిద్దరు బాగా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదని.. అయితే, మూకుమ్మడిగా అందరూ విఫలమైతే ఇలాంటి ఫలితాలే వస్తాయని తలా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ప్రతిసారీ 180- 200 పరుగులు స్కోరు చేయాల్సిన అవసరం లేదన్న ధోని.. పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా కనీస ప్రదర్శన చేయాలని తమ బ్యాటర్లను విమర్శించాడు. జట్టులో ఎక్కువ మంది విఫలమవుతుంటే ఎలాంటి మార్పులు చేయాలో కూడా అర్థం కాదంటూ పెదవి విరిచాడు. చదవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేA milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025

Construction costs of five iconic towers have skyrocketed5
అవినీతి 'ఐకానిక్‌'!

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్‌ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్‌ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్‌ టవర్ల టెండర్లలో భారీ గోల్‌మాల్‌ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్‌లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్‌ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్‌ (నిలువు కాంక్రీట్‌ దిమ్మెలు), బీమ్స్‌ (అడ్డు కాంక్రీట్‌ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్‌ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేస్తారు. ఐకానిక్‌ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ డిజైన్‌ చేసింది. డయాగ్రిడ్‌ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్‌ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్‌ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్‌ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్‌డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్‌ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్‌ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్‌ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికార­వర్గాలు వ్యాఖ్యాని­స్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధా­రాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చే­తులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యా­యి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీ­షన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పు­డు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌– జెనిసిస్‌ ప్లానర్స్‌–డిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్‌డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాల­యాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించను­న్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు అప్పగించింది.

Trump Key Announcement On Russia-Ukraine Peace Talks6
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్‌ కీలక ప్రకటన

రోమ్‌: ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రోమ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్‌లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్‌(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్‌ విట్కాఫ్‌తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎ‍ట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్‌ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ట్రంప్‌​ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్‌స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్‌ బిలియనీర్‌ అయిన స్టీవ్‌ విట్‌కాఫ్‌(Steve Witkoff).. ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్‌ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్‌ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్‌హౌజ్‌ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్‌పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్‌ అంత్యక్రియలకు జెలెన్‌స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్‌కాఫ్‌తో పుతిన్‌ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్‌ యరోస్లావ్‌ మోస్కాలిక్‌ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్‌ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్‌ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్‌ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్‌పై, అటు జెలెన్‌స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Has Sukanya Samriddhi Yojana interest rate reduced in April June 20257
బాలికల ప్రత్యేక స్కీమ్‌.. వడ్డీ రేటు మారిందా?

సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథ​కానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.విత్‌డ్రా ఎప్పుడు?సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు.

Pakistani actress Mahira Khan condemns Pahalgam Incident8
పహల్గామ్‌ ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌ నటి.. నెటిజన్ల ఆగ్రహం!

2017లో రాయిస్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్‌. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్‌కు చెందిన నటులు ఫవాద్‌ ఖాన్‌తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్‌ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్‌ తన పోస్ట్‌ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్‌ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్‌ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్‌ ఖాన్‌ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్‌ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్‌ గులాల్‌' (Abir Gulaal Movie)ను భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ హీరోగా నటించగా.. బాలీవుడ్‌ హీరోయిన్‌ వాణీ కపూర్‌ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్‌, ఫరీదా జలాల్‌, పర్మీత్‌ సేతి, సోనీ రజ్దాన్‌ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్‌. బగ్దీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను వివేక్‌ అగర్వాల్‌, అవంతిక హారి, రాకేశ్‌ సిప్పీ, ఫిరూజీ ఖాన్‌ నిర్మించారు.

EPFO simplifies PF account transfer process on job change9
పీఎఫ్‌ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌!

న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్‌) ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్‌ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్‌ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్‌ జమలు జరిగిన (సోర్స్‌) ఆఫీస్‌. ఈ మొత్తం మరో ఈపీఎఫ్‌ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్‌ ఆఫీస్‌)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్‌ల బదిలీకి డెస్టినేషన్‌ ఆఫీస్‌ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్‌ 13 సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్‌లకు సోర్స్‌ ఆఫీస్‌ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్‌ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

T-LIFE: Telangana Lady Industrialists Federation For Entrepreneurs10
'టీ లైఫ్‌'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..

‘మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే నిర్ణయాధికారం వస్తుంది’ అని నమ్మే వాళ్లలో తాటిపర్తి దీపికారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఎవరు? హైదరాబాద్‌ వాసి .. టీ లైఫ్‌ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌) వ్యవస్థాపకురాలు. ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు అవగాహన కల్పించి, ఉచిత శిక్షణతో వాళ్లను ఆ దిశగా నడిపించి.. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమె ఇరవై ఏళ్ల ఆ ప్రయాణం గురించే ఈ కథనం.. చదువుకునే వయసు నుంచే దీపికా రెడ్డి .. ఇండస్ట్రియలిస్ట్‌గా స్థిరపడాలనే కోరుకున్నారు. అయితే ఆ లక్ష్యానికి ప్రయాణం మాత్రం పెళ్లయ్యాకే మొదలైంది. ఆమెకున్న పలురకాల ఆసక్తులు, అభిరుచుల మేరకు ఆయా కోర్సులు చదువుకుంటూ ఆయా రంగాల్లో తన ఆంట్రప్రెన్యూర్‌ స్కిల్స్‌ను నిరూపించుకున్నారు. అలా పెళ్లి తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి హెయిర్‌ అండ్‌ స్కిన్‌ కోర్స్‌లో డిప్లొమా చేశారు. ఏరోబిక్స్‌లో శిక్షణ పొందారు. ఆ అర్హతలతోనే ‘బ్యూటీ అండ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌’ అనే ఓన్లీ ఫర్‌ విమెన్‌ జిమ్‌ను స్టార్ట్‌ చేశారు. ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్స్‌ చేసి.. ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారి, వేదీస్‌ ఇంటీరియర్స్‌ పేరుతో సంస్థనూ పెట్టారు. టీ లైఫ్‌.. ఇంటీరియర్‌ డిజైనర్‌ అండ్‌ ఆంట్రప్రెన్యూర్‌గా కొనసాగుతున్న దీపికకు హైదరాబాద్‌లోని ఎలీటా అసోసియేషన్‌ పరిచయం అయింది. అది మహిళల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించడానికి శిక్షణనిచ్చే సంస్థ. అందులో జాయింట్‌ సెక్రటరీగా జాయిన్‌ అయ్యారు ఆమె. మూడేళ్లపాటు ఆ అసోసియేషన్‌లో అనుభవం గడించాక 2017లో తను సొంతంగా టీ లైఫ్‌ (తెలంగాణ లేడీ ఇండస్ట్రియలిస్ట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌) సంస్థను ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ పట్ల అవగాహన కల్పించి, వారికి కావల్సిన శిక్షణను ఇప్పించి వారిని ఆంట్రప్రెన్యూర్స్‌గా మలచడమే ఆ సంస్థ లక్ష్యం. అందుకే దాని తరపున ఆమె తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పర్యటిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్స్‌ కావాలనుకున్న మహిళల కోసం అక్కడి కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారుల సహాయంతో సదస్సులు నిర్వహిస్తుంటారు. ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ కోసం బయట ఎలాంటి అవకాశాలున్నాయి, ప్రభుత్వ పథకాలేంటీ, లోన్స్, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, బిజినెస్‌ కోసం వాళ్ల ప్రాంతాల్లో ఉన్న రీసోర్సెస్‌ వంటివన్నీ వివరిస్తారు. సదస్సు తర్వాత వాళ్లకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి, హాజరైన మహిళలకున్న బిజినెస్‌ ఆసక్తులను ఆ దరఖాస్తు ఫారాల్లో నింపమంటారు. ఆ ఫారాల ఆధారంగా వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌కి అందుతున్న రుణాలతో అందులోని సభ్యులు ఎలాంటి బిజినెస్‌ పెట్టుకోవచ్చో చెప్పి, తగిన శిక్షణనిచ్చి.. ఆ వ్యాపారాలను పెట్టించారు కూడా! ఈ క్రమంలో ఆమె గమనించిన విషయం.. ఆ మహిళలందరినీ వాళ్లమ్మాయిలు ప్రోత్సహించడం.అమ్మాయిల కోసం.. దీపిక.. గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలకూ వెళ్లి అక్కడి అమ్మాయిలకూ బిజినెస్‌ రంగంలో ఉన్న అవకాశాలు, శిక్షణ వంటి వాటిమీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడున్నర వేల మంది మహిళలకు శిక్షణనిచ్చారు. అందులో వందకు పైగా మహిళలు ఆంట్రప్రెన్యూర్స్‌గా నిలబడ్డారు. ఇందులో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌కి చెందిన మహిళలే ఎక్కువ. ప్రస్తుతం టీ లైఫ్‌కి జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ఆఫీసులున్నాయి. మే నెలలో మహబూబ్‌నగర్‌లో కూడా ప్లాన్‌ చేయాలనుకుంటారు. టీ లైఫ్‌ ఆరంభించినప్పుడు కనీసం పదివేల మంది మహిళలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేరుకున్నారు కూడా. నెలకు నాలుగు నుంచి అయిదు బ్యాచ్‌లుంటాయి. అభ్యర్థులు పెట్టాలనుకున్న బిజినెస్‌ను బట్టి ఆ శిక్షణ కార్యక్రమాల గడువు ఉంటుంది. ఈ ట్రైనింగ్‌ సెషన్స్‌ అన్నీ ఎక్స్‌పర్ట్స్‌తోనే ఉంటాయి. ‘మొదటి నుంచీ నన్ను నేను ప్రూవ్‌ చేసుకుంటూ వచ్చిన చోటల్లా అది కుటుంబంలో కానీ.. సమాజంలో కానీ ఎక్కడైనా నాకు గౌరవం పెరుగుతూ వచ్చింది. దాన్ని గ్రామీణ మహిళలు, పట్టణ ప్రాంతం వారూ పొందాలని అనుకున్నాను. వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాను. అందుకే టీ లైఫ్‌ని స్టార్ట్‌ చేశాను. మేము వెళ్లినచోటల్లా పాజిటివ్‌ రెస్పాన్సే వస్తోంది. స్టూడెంట్స్‌ కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్లకోసం కంప్యూటర్, ఏఐ బేస్డ్‌ ప్రోగ్రామ్స్‌నూ పెట్టాం. ఇంట్లో వాళ్ల నుంచీ నాకు సపోర్ట్‌ దొరుకుతోంది. టీ లైఫ్‌ ధ్యేయం ఒక్కటే.. మహిళలు ఆంట్రప్రెన్యూర్స్‌గానే కాదు ఇండస్ట్రియలిస్ట్స్‌గానూ ఎదిగేందుకు తోడ్పడాలని. అయితే దీనికి ప్రభుత్వ సహకారం కూడా అసవరమే! కుటుంబంలో మహిళ ఆర్థికంగా బలంగా ఉంటే తర్వాత తరాల అమ్మాయిలూ స్ట్రాంగ్‌గా ఉంటారని నా నమ్మకం.’ అంటున్నారు దీపికారెడ్డి – సరస్వతి రమ(చదవండి: స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement