
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
● డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తేనే ఉపాధ్యాయులకు పాయింట్లు ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తేనే సర్వీస్ బుక్‌లో ఉపాధ్యాయుల పాయింట్లను నమోదు చేస్తామని, బదిలీ, పదోన్నతుల్లో ప్రాధాన్యత ఇస్తామని తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని, కేవలం ఉపాధ్యాయులే కారణమని పేర్కొనడం భావ్యం కాదన్నారు. పెరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ప్రభుత్వం నిలువరించాలని, పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శామ్యుల్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వృకోధర్, సంఘ బాధ్యులు సుధాకర్, దిలీప్, ప్రేమ్‌సింగ్, కొండయ్య, వీరయ్య, అరవింద్, కృష్ణ, సాయికాంత్, సంతోష్, ప్రహ్లాద్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.