
అమ్మా.. క్షమించు
● అన్నయ్యా.. సారీ.. ● నా ఆరోగ్యం మెరుగుపడడం లేదు ● బాధ భరించలేక‘పోతున్నా’ ● సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం
నెన్నెల(బెల్లంపల్లి): కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స చేయించుకున్నా మెరుగు పడకపోవడంతో మనస్తాపం చెందాడు. అనారోగ్యం బాధను భరించలేకపోయాడు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌లో జరిగింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్మాటికారి సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్ (24) పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిల్లలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఉరేసుకునే ముందు బెడ్‌రూమ్‌లో అతని మంచంపై సుసైడ్ నోట్ రాసిపెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా సొంత నిర్ణయంతో చనిపోతున్నా. అన్నయ్య సారీ రా... నీవు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీతో ఉండను.. అమ్మా నాన్నను కష్టపెట్టకు.. నన్ను మీరంతా క్షమిస్తారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నా.. అని నోట్ రాసి ఉంచాడు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
నేత్రదానం
అనిల్ కళ్లు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు భీం పుత్ర శ్రీనివాస్, బ్లడ్ డోనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రహీమ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్‌కుమార్‌కు తెలియజేయడంతో గ్రామానికి వచ్చి నేత్రాలు సేకరించారు.