
● విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రచారం షురూ ● ఉపాధ్యాయులకు
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తల్లిదండ్రులను మభ్యపెడుతూ తమ బడిలో చేర్పించేందుకు ప్రయత్నాలు షురూచేశాయి. ఈనెల 24నుంచి వేసవి సెలవులు మొదలయ్యాయి. అప్పటినుంచే ప్రైవేట్ యా జమాన్యాలు ఎన్నికల ప్రచారం తలపించేలా తమ ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతున్నారు. కరపత్రాలు పంచుతూ ఇప్పుడు అడ్మిషన్ చేయిస్తే రా యితీ ఇస్తామని చెబుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఫ్రీ అడ్మిషన్ అంటూ బుట్టలో వేసుకుంటున్నారు. ఈ మేరకు టీచర్లకు టార్గెట్లు ఇచ్చారు. ప్రతీ ఉపాధ్యాయుడు కనీసం 10 నుంచి 20 మందిని చేర్పించాలని ఆదేశించారు. లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించడంతో వారు నానాతంటాలు పడుతున్నారు. ఉదయం 7గంటలకే విద్యార్థుల ఇళ్ల ముందు వాలుతున్నారు. తమ పాఠశాలలో బోధన బాగుంటుంది.. మంచి ఫలితాలు సాధి స్తున్నామంటూ తల్లిదండ్రులకు ఎర వేస్తున్నారు. అయితే ప్రభుత్వం బడిబాట నిర్వహించే సరికే పిల్ల లు ప్రైవేట్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని పలు వురు చర్చించుకుంటున్నారు.
వ్యాపారంగా మలుచుకొని..
జిల్లాలో ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలలు మండలాని కి ఒకటో.. రెండో ఉండేవి. ప్రస్తుతం ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మలిచారు. కనీస సౌకర్యాలు లేకపోయినా అధిక ఫీ జులతో తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఎల్‌కేజీ మొదలు.. పదోతరగతి వరకు డొనేషన్లు, ఫీజు లు, పుస్తకాలు, నోట్‌బుక్స్, ప్రాజెక్టులు, బస్సు ఫీజు లు వంటి తదితర ఖర్చులతో మోతమోగిస్తున్నారు. విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి..తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా చే స్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు సైతం దృష్టి సారించడం లేదు. డీఈవో పరిధిలో 700 వరకు ప్రభుత్వ యా జమాన్య పాఠశాలలు ఉండగా, దాదాపు 200 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు ల నియంత్రణ తమ పరిధిలో లేదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం.
నిబంధనలకు తూట్లు..
ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 అమలు కావడం లేదు. తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. నిబంధనల ప్రకారం పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు లేవు. ఇరుకు గదుల్లో, చుట్టూ వాహనం తిరిగే స్థలం లేని భవనాల్లో స్కూళ్లను ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారిచే విద్యాబోధన చేయించాల్సి ఉండగా, విద్యార్హత లేనివారితో చదువులు కొనసాగిస్తున్నారు. ఫీజుల వివరాలు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉండగా, ఏ పాఠశాలలో కూడా అలా జరగడం లేదు. చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇలా నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సర్కారు బడుల్లో చేర్పించాలి
సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన అందుతుంది. అర్హత గల ఉపాధ్యాయులతో పా టు వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నభోజనం, ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు.
– శ్రీనివాస్ రెడ్డి, డీఈవో
ప్రచారం షురూ..
జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాల ప్రచారం ఊపందుకుంది. ఎండలు దంచికొడుతున్నా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. తమ పాఠశాలలో చేర్పిస్తే ఫీజులో రాయితీ కల్పిస్తాం.. బస్సు సౌకర్యం వంటి తదితర మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. అందులో చేరాక ఫీజులు పూర్తిస్థాయిలో ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి 5వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌లో చేరారు.