
● నెక్కర్ వస్త్రం వచ్చింది.. షర్ట్ బట్ట రాకపాయే ● ఏటా
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం కుట్టించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. అయితే పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక జత పంపిణీ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఆలస్యం కాగా ఈసారి ముందస్తుగానే నెక్కర్‌కు సంబంధించిన వస్త్రం వచ్చినప్పటికీ, షర్ట్ వస్త్రం ఇంకా రాలేదు. ఈ జాప్యం కుట్టుపై ప్రభావం పడనుంది. ఏటా బడులు తెరిచే నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని అధికారులు చెబుతున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అయితే తొలిరోజునే యూనిఫాం అందిస్తే విద్యార్థులు చిరిగిన డ్రెస్సులతో కాకుండా కొత్త బట్టలతో హుషారుగా బడిబాట పట్టే అవకాశం ఉంటుంది.
66,282 మంది విద్యార్థులకు..
జిల్లాలో యూనిఫాం అందించే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 66,282 మంది చదువుతున్నారు. ఇందులో బాలురు 31,780 మంది ఉండగా, బాలికలు 34,502 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాం ఉచితంగా అందజేస్తుంది. గతంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి అందించేవారు. గతేడాది నుంచి స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టిం చి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ కుట్టుకు సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం డీఆర్డీఏకు అప్పగించింది. వారు స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి పాఠశాలలకు అందజేయనున్నారు. గతేడాది మండలానికి సంబంధించి వస్త్రం రాగా, ఈసారి ఆయా పాఠశాలలకు సంబంధించి వస్త్రం వచ్చింది. దీంతో కొంత ఇబ్బందులు తప్పనున్నాయి. బట్ట సరిపోక గతేడాది టైలర్లు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఆ సమస్య లేదని అధికారులు చెబుతున్నారు.
కుట్టుడు షురూ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యా శాఖ అధికారులు యూనిఫాం కుట్టించడంపై దృష్టి సారించారు. ప్రతి మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీడీవో, ఎంఈవో, ఏపీఎంలు ఉన్నారు. యూనిఫాం కుట్టడం ఎక్కడివరకు వచ్చిందనే వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులతో కలిసి పర్యవేక్షిస్తారు. సకాలంలో పాఠశాలలకు అందేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది నెక్కర్‌కు సంబంధించిన వస్త్రం వచ్చినప్పటికీ షర్ట్‌కు సంబంధించిన బట్ట రాకపోవడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది టైలర్లకు మేలో వస్త్రం ఇవ్వగా, వారు ఒక జత జూలై, ఆగస్టు మాసాల్లో విద్యార్థులకు అందించారు. రెండో జత అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు.
పెరిగిన కుట్టు కూలి..
జిల్లాలో..
యూనిఫాం అందించే పాఠశాలలు: 1,145
కుట్టాల్సిన యూనిఫాం జతలు : 1,32,564
స్వయం సహాయక సంఘాలు : 10,756
ఆయా సంఘాల్లోని సభ్యులు : 1,16,885
బడులు తెరిచేనాటికి అందిస్తాం..
పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజు వి ద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్యాంట్, లహంగాలకు సంబంధించిన వస్త్రం 31 శాతం వచ్చింది. జిల్లాకు మొత్తం బట్ట 2,71,420 మీటర్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 84,022 మీటర్లు వచ్చింది. ఈ వస్త్రాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా టైలర్లకు అందించాం. త్వరలోనే షర్ట్ బట్ట కూడా రానుంది.
– సుజాత్ ఖాన్,
విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి
యూనిఫాంకు సంబంధించి ప్రభుత్వం కుట్టు కూలి పెంచింది. ఇదివరకు ఒక జతకు రూ.50 ఉండగా, ప్రస్తుతం రూ.75 చెల్లించనుంది. ఇదిలా ఉండగా 1 నుంచి 5వ తరగతి బాలురకు నెక్కర్, షర్ట్, 6 నుంచి 12వ తరగతి వారికి షర్ట్, ప్యాంట్, అలాగే 1 నుంచి 3వ తరగతి చదివే బాలికలకు స్కర్ట్, 4,5 తరగతుల వారికి షర్ట్, లహంగా, 6 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు పంజాబీ డ్రెస్సు ఇవ్వనున్నారు.

● నెక్కర్ వస్త్రం వచ్చింది.. షర్ట్ బట్ట రాకపాయే ● ఏటా

● నెక్కర్ వస్త్రం వచ్చింది.. షర్ట్ బట్ట రాకపాయే ● ఏటా