
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్నారు
అనంతపురం అర్బన్: గ్రామీణ పేదల వలసలు, ఆకలిచావులు నివారించేందుకు 100 రోజులు గ్యారెంటీ పనులు కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఉపాధి’ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కృష్ణకళామందిర్‌లో బహిరంగసభ నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జెల్లి విల్సన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బడ్జెట్‌లో రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే ఏటా తగ్గిస్తూ ఈ ఏడాది రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కేంద్రానికి అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం కూడా ఉపాధి చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మెటీరియల్ కాంపోనెట్‌ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. పథకంలో నిధులను కూలీలకే కేటాయించాలన్నారు. కుటుంబ జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి వయోజనుడికి విడిగా జాబ్‌కార్డు ఇవ్వాలన్నారు. రోజు కూలీ రూ.700 ఇవ్వాలన్నారు. ప్రతి గ్రూప్‌కు పని కల్పించకపోతే ఏడాదికి ప్రతి కూలీకి రూ.12 వేలు చొప్పున ఉపాధి భృతి చెల్లించాలన్నారు. సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదాగాంధీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, శ్రీసత్యసాయి జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలి
బహిరంగసభలో వక్తల పిలుపు