వేర్వేరు హత్య కేసుల్లో వీడిన మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు హత్య కేసుల్లో వీడిన మిస్టరీ

Published Fri, Apr 25 2025 8:14 AM | Last Updated on Fri, Apr 25 2025 8:14 AM

వేర్వేరు హత్య కేసుల్లో వీడిన మిస్టరీ

వేర్వేరు హత్య కేసుల్లో వీడిన మిస్టరీ

తాడిపత్రి టౌన్‌: వివాహేతర సంబంధాల కారణంగానే తాడిపత్రి ప్రాంతంలో రెండు హత్యలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వేర్వేరు ఘటనలకు సంబంధించిన హత్య కేసుల్లో నిందితులను గురువారం అరెస్ట్‌ చేశారు. తాడిపత్రి పట్టణ పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ సాయిప్రసాద్‌ వెల్లడించారు.

● పుట్లూరు మండలం చప్పిడి వెంగన్నపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరెడ్డికి 15 సంవత్సరాల క్రితం తాడిపత్రి మండలం బందర్లపల్లికి చెందిన పుష్పావతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరెడ్డి పెళ్లి కాకముందు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లిలో నివాసముంటున్న తన పిన్నమ్మ ఇంటికి తరచూ వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అక్కిలి శ్రీలక్ష్మితో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే శ్రీలక్ష్మికి పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన రాజారెడ్డితో పెళ్లి జరిగింది. భర్త మరణించడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలో సులువుగా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. దీంతో తన భార్య పుష్పావతిని, కుమారులను వెంకటేశ్వరరెడ్డి నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. అదే సమయంలో భర్త వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ఆమె... ఆయనలో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో శ్రీలక్ష్మిని పిలుచుకుని నేరుగా తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న అద్దె ఇంట్లోకి వెంకటేశ్వరరెడ్డి మకాం మార్చాడు. ఆ తర్వాత కాపురానికి రావాలని పుష్పావతికి తెలపడంతో వెంకటేశ్వరెడ్డి పేరు మీదున్న 9 ఎకరాల పొలాన్ని పిల్లల పేరుపై రాయాలని ఆమె పట్టుబట్టింది. ఈ అంశాన్ని వెంకటేశ్వరరెడ్డి, శ్రీలక్ష్మి వ్యతిరేకించారు. పుష్పావతి ఉంటే ఎప్పటికై నా తమకు ముప్పేనని భావించిన వారు.. పథకం ప్రకారం తాడిపత్రిలోని హేమాద్రి గెస్ట్‌హౌస్‌లో పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలపై పంచాయితీకి రావాలని కబురు పెట్టారు. దీంతో ఈ ఏడాది జనవరి 17న హేమాద్రి గెస్ట్‌హౌస్‌కు పుష్పావతి చేరుకుంది. పంచాయితీ పెద్దలతో మాట్లాడిన అనంతరం గది బయట వేచి ఉన్న పుష్పావతిపై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న వేట కొడవలితో వెంకటేశ్వరరెడ్డి దాడి చేసి, హతమార్చి ఉడాయించాడు. అనంతరం శ్రీలక్ష్మిని పిలుచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి శ్రీలక్ష్మి ఇంట్లో ఉన్న సామగ్రిని తీసుకెళ్లేందుకు యల్లనూరు రోడ్డులో ఉన్న అద్దె గదికి వారు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వెంకటేశ్వరెడ్డి, శ్రీలక్ష్మిని అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

● తాడిపత్రిలోని ఓశాంతి నగర్‌ నివాసముంటున్న మణికి పామిడి గ్రామానికి చెందిన యక్కలూరి మహేష్‌తో వివాహమైంది. ఈ క్రమంలో అత్తింటికి తరచూ వచ్చి వెళ్లే మహేష్‌... ఆ పక్కనే నివాసముంటున్న రమీజాబీతో ఏర్పడిన పరిచయంతో చాలా చనువుగా ఉండేవాడు. ఇది గమనించిన రమీజాబీ కుమారుడు సయ్యద్‌ ఫైరోజ్‌ తన పిన్నమ్మ షేక్‌ ఖాజాభీతో చెప్పుకుని బాధపడ్డాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఈనెల 10న మహేష్‌ తన భార్య మణితో పాటు తాడిపత్రికి వచ్చాడు. 16వ తేదీ రమీజాబీతో షేక్‌ ఖాజాబీ, సయ్యద్‌ ఫైరోజ్‌ గొడవ పడుతుంటే వారికి సర్దిచెప్పేందుకు మహేష్‌ వెళ్లాడు. తమ ఇంటి గొడవలో నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నాంటూ మహేష్‌పై ఖాజాబీ ఆగ్రహం చేస్తూ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఫైరోజ్‌కిచ్చి పొడవమని ప్రోత్సహించింది. దీంతో మహేష్‌ పొట్టలో బలంగా పొడవంతో తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో సయ్యద్‌ ఫైరోజ్‌, షేక్‌ ఖాజాబీను వారి ఇంటి వద్దనే గురువారం పోలీసులు అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

వివాహేతర సంబంధాలే కారణమని నిర్ధారించిన పోలీసులు

హత్య కేసుల్లో నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement