
పీఆర్సీ ఏర్పాటు చేయాలి
గుత్తి: పీఆర్సీ ఏర్పాటుతో పాటు ఐఆర్‌ను వెంటనే మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గుత్తిలోని పద్మవాణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 30 శాతం ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలన్నారు. ఆర్థిక బకాయిలు రూ.30 వేల కోట్లకు గాను కేవలం రూ.7,300 కోట్లు మంజూరు చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యుడు, కె.చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ... జీఓ 117ను వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే 72, 73, 74 జీఓల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ఇన్‌చార్జ్ నాగరాజు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, గుత్తి ఎంఈఓలు రవినాయక్, మనోహర్, ఎస్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆసీఫ్, బసవరాజు, సీనియర్ నాయకులు శివ శంకర్, సత్య, జోగి శీన, పద్మవాణి బాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్
గుత్తిలో ఎస్టీయూ
జిల్లా కార్యవర్గ సమావేశం