
వైఎస్ జగన్ హయాంలో ఏపీ పోలీస్ శాఖకు దేశంలోనే అత్యున్నత ర్యాంక్
నాడు సమర్థంగా విధులు నిర్వర్తించిన ఏపీ పోలీస్ నిబంధనల మేరకే అరెస్టులు
2023–24లో ఉత్తమ పోలీసింగ్‌లో దేశంలో రెండో స్థానం కామన్‌కాజ్, లోక్‌నీతి– సీఎస్‌డీఎస్ సర్వేలో వెల్లడి
57% 202-24లో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలు పాటించే వారని చెప్పినవారు
51% ఆందోళనలు, ధర్నాల కేసుల విషయంలో పోలీసులు సంయ మనంతో వ్యవహరిం చారని చెప్పినవారు
49% చిన్నచిన్న సంఘటనలకు సంబంధించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించిన కేసులు
సాక్షి, అమరావతి: అమ్మో...! పోలీస్...! అని ప్రస్తుతం రాష్ట్రం హడలెత్తిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెడ్‌బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు సాగిస్తున్న అరాచకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, పోలీసు స్టేషన్లో చిత్రహింసలు... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వసాధారణ దృశ్యాలు అయిపోయాయి. కానీ, ఇదంతా ఈ 10 నెలల్లో రాష్ట్ర పోలీసు శాఖ ఒంటికి పూసుకున్న కళంకం.
ఏడాది క్రితం వరకు ఏపీ పోలీసు శాఖ పనితీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. శభాష్... ఏపీ పోలీస్... అని జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందిందని ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’ (సీఎస్‌డీఎస్) సర్వే వెల్లడించింది. కామన్ కాజ్ సంస్థతో కలసి లోక్‌నీతి సంస్థకు చెందిన సీఎస్‌డీఎస్ దేశంలో పోలీసుల పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2023–24లో దేశంలో 17 ప్రధాన రాష్ట్రాల్లో పోలీసుల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’ అనే పేరుతో తాజాగా వెల్లడించింది. పోలీసు విధులు సక్రమంగా నిర్వహించడంలో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆ నివేదిక పేర్కొనడం విశేషం.
అదీ పోలీసింగ్ అంటే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ చట్టానికి లోబడి సమర్థంగా విధులు నిర్వర్తించింది. ప్రధానంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిబంధనల మేరకు అరెస్టులు, అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు అత్యంత మెరుగైన పనితీరును కనబరిచారని సీఎస్‌డీఎస్ సంస్థ సర్వే వెల్లడించింది. దేశంలో అత్యంత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేరళ పోలీసు శాఖ మొదటిస్థానం సాధించగా... చివరి మూడు స్థానాల్లో బిహార్(15), కర్ణాటక(16), జార్ఖండ్(17) నిలిచాయి.
అప్పుడు నిబంధనల మేరకే అరెస్టులు..
⇒ బాధితుల ఫిర్యాదులపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు స్పందన మెరుగ్గా ఉండేదని సీఎస్‌డీఎస్ సర్వే నివేదిక వెల్లడించింది.
⇒ ఫిర్యాదు రాగానే సత్వరం స్పందించి తగిన చర్యలు చేపట్టేవారు. అదే సమయంలో నిందితులను అరెస్టు చేయడంలోనూ నిబంధనలను అతిక్రమించకుండా చట్టానికి లోబడే వ్యవహరించేవారని ఆ సర్వే స్పష్టం చేసింది.

⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టు చేయడంలో ఎల్లప్పుడూ కచ్చితంగా నిబంధనలను పాటించేవారని 57శాతం మంది చెప్పారని ఆ సర్వే వెల్లడించింది. తద్వారా రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టులు చేయడంలో పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరించేవారని తేల్చి చెప్పారు. అందుకే ఉత్తమ పోలీసింగ్‌లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
⇒ 2023–24లో అత్యధికంగా 32% అరెస్టులు దొంగతనాలు, దోపిడీ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. అరెస్టుల్లో 17% మహిళలపై నేరాల కేసుల్లో, 12% అల్లర్ల కేసుల్లో, 12%హత్యలు, దాడుల కేసుల్లో, 4%పబ్లిక్ న్యూసెన్స్ కేసుల్లో చేశారు. అంటే దాదాపు అన్ని అరెస్టులు కూడా సరైన కేసుల్లోనే చేశారని నివేదిక పేర్కొంది. అక్రమ కేసులతో వేదింపులకు పాల్పడేవారు కాదని స్పష్టంగా తెలిపింది.
⇒ ఆందోళనలు, ధర్నాల విషయంలో 51% కేసుల్లో పోలీసులు సంయమనం పాటించారని కూడా వెల్లడించింది. చిన్నచిన్న సంఘటనలకు కేసుల్లో కౌన్సిలింగ్ ద్వారానే 49% కేసులను పరిష్కరించారు.